శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 16:36:42

బిగ్‌బాస్కెట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయనున్న టాటా...?

బిగ్‌బాస్కెట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయనున్న టాటా...?

బెంగళూరు: ఇండియన్ ఆన్‌లైన్ గ్రాసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌లో టాటా గ్రూప్ మెజార్టీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,350 కోట్లు)కు ఈ డీల్ కుదరవచ్చునని భావిస్తున్నారు. గ్రూప్‌లోని కన్స్యూమర్ బిజినెస్‌లను అన్నింటిని కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశీయంగా అమెజాన్, రిలయన్స్ సంస్థలు ఈ-కామర్స్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా ఈ-కామర్స్ దిశగా అడుగులు వేస్తున్నది.

బెంగళూరుకు చెందిన బిగ్ బాస్కెట్.. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫ్రెష్ సేవలతో పోటీ పడుతోంది. ఎందుకంటే కరోనా సమయంలో చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులు ఇంటి వద్దనే ఉండి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. సూపర్ యాప్ ద్వారా ఈ-కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న టాటా గ్రూప్.. ఇప్పుడు బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నది.  

చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌కు బిగ్ బాస్కెట్‌లో 26 శాతం వాటా ఉంది. తమ వాటాను మొత్తాన్ని అలీబాబా విక్రయించాలని భావిస్తున్నదని కూడా వార్తలు వస్తున్నాయి. చర్చలు సాగుతున్నాయని, పురోగతిలో ఉన్నాయని, అయితే చివరకు ట్రాన్సాక్షన్‌కు దారి తీస్తుందా లేదా చెప్పలేమని అంటున్నారు. బిగ్ బాస్కెట్‌లో భారీ వాటా కోసం టాటా గ్రూప్ 500 మిలియన్ల నుండి 700 మిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపవచ్చునని కూడా తెలుస్తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.