శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 19:13:08

మాయావతికి ఎదురుదెబ్బ.. ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు

మాయావతికి ఎదురుదెబ్బ.. ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసే పనిలో మాయావతి ఒకవైపు బిజీగా ఉండగా.. మరోవైపు బీఎస్పీ నిలుపుతున్న అభ్యర్థికి మద్దతుగా సంతకాలు చేయలేమంటూ ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం ప్రిసైడింగ్ అధికారికి అఫిడవిట్ ఇచ్చారు. బీఎస్‌పీకి తగినంత బలం లేకపోయినప్పటికీ.. పార్టీ జాతీయ సమన్వయకర్త, బిహార్ యూనిట్ ఇంఛార్జి రామ్‌జీ గౌతమ్‌ను రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా నిలిపారు. గౌతమ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

రాజ్యసభ ఎన్నికకు బీఎస్‌పీ అభ్యర్థి రామ్‌జీ గౌతమ్ నామినేషన్‌పై ప్రతిపాదకులుగా తాము సంతకం చేయలేదని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అస్లాం చౌదరి, ముజ్తాబా సిద్దిఖీ, హకీమ్ లాల్ బింద్, అస్లాం రిని, గోవింద్‌ జాటవ్.. ప్రిసైడింగ్ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు సుష్మా పటేల్, హరిగోవింద్ భార్గవ కూడా ఉన్నారు. అనంతరం వీరు అక్కడి నుంచి నేరుగా అఖిలేష్‌ యాదవ్‌ను కలిసేందుకు సమాజ్‌వాది పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. నవంబర్ 9 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను ఈ రోజు పరిశీలిస్తున్నారు. ఈ బీఎస్పీ ఎమ్మెల్యేల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రిసైడింగ్ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. మొత్తం 10 స్థానాలకుగాను బీజేపీ నుంచి ఎనిమిది మంది, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థులతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి రంగంలో ఉన్నారు. నవంబర్‌ 9 న ఎన్నికలు జరుగనున్నాయి. బీఎస్పీ ఎమ్మెల్యేల తిరుగుబాటు చర్య మరో 12 రోజుల్లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలపై ప్రభావం చూపునున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.