మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 17:46:06

తప్పించుకున్న పులి.. పట్టుకున్న సిబ్బంది

తప్పించుకున్న పులి.. పట్టుకున్న సిబ్బంది

తిరువనంతపురం: సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న పెద్దపులిని అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలో సంచరిస్తూ పలు పశువులను తిని స్థానికులకు భయాందోళన కలిగించిన ఆడ పులిని గత వారం అటవీశాఖ సిబ్బంది బంధించారు. ఈ సందర్భంగా స్వల్పంగా గాయపడిన దానిని చికిత్స కోసం తిరువనంతపురంలోని నెయ్యర్ లయన్ సఫారి పార్క్‌కు తరలించారు. అక్కడ బోనులో ఉంచగా శనివారం మధ్యాహ్నం తప్పించుకున్నది. దీంతో పార్క్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ పులి బయటకు వెళ్లకుండా అన్ని మార్గాలను మూసివేశారు. పార్క్‌ చుట్టూ ఎత్తైన ఫెన్సింగ్‌ ఉండటంతో అది లోపలే తిరుగుతున్నది.

చివరకు వెటర్నరీ డాక్టర్ ఆర్న్ జకారియా నేతృత్వంలోని అటవీ, పోలీస్‌ బృందం ఆ పులిని గుర్తించింది. దానికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బంధించారు. కాగా ఆ పులి కోలుకున్న తర్వాత అడవిలో విడిచిపెట్టాలా లేక జూలో ఉంచాలా అన్నది నిర్ణయిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కే రాజు తెలిపారు. మరోవైపు ఈ అంశంపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) సలహా తీసుకుంటామని అధికారులు చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.