కరోనా టీకాలు స్వీకరించిన భూటాన్ ప్రధాని

న్యూఢిల్లీ: ఆరు పొరుగు దేశాలకు కరోనా టీకాలను భారత్ ఎగుమతి చేసింది. సీరం ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన 1.5 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను భూటాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ టీకాలు ప్రత్యేక విమానంలో బుధవారం ఆ దేశానికి చేరాయి. భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే థెరింగ్ సమక్షంలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ నుంచి ఆ దేశ ఆరోగ్య మంత్రి డెచెన్ వాంగ్మో అందుకున్నారు.
మరోవైపు మాల్దీవులకు కూడా భారత్ నుంచి లక్ష డోసుల కరోనా టీకాలు బుధవారం చేరాయి. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ వీటిని స్వీకరించారు. ఏ సంక్షోభంలోనైనా తమ వెంట ఉండే తొలి దేశం భారత్ అని ఆయన కొనియాడారు. ‘ఈ ఉదార బహుమతికి ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రభుత్వం, ఆ దేశ ప్రజలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ పేర్కొన్నారు.
కాగా మరో నాలుగు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, సీషెల్స్ కూడా కరోనా టీకాలను కోరాయని, ఆయా దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, మారిషస్ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు అవసరమైన అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
పొరుగు దేశాలకు ‘తొలి ప్రాధాన్యత’ నినాదం కింద కరోనా సంక్షోభ సమయంలో భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నది. గత ఏడాది వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు వంటి వాటిని ఉచితంగా అందజేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.