గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 16:05:25

వచ్చే నెల 5న అయోధ్యలో భూమిపూజ

వచ్చే నెల 5న అయోధ్యలో భూమిపూజ

లక్నో : అయోధ్యలో నిర్మించతలపెట్టిన శ్రీ రామ్ ఆలయానికి భూమి పూజ ఆగస్టు 5 న జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిపేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సిద్దమైంది. ఆ రోజున ప్రధాని మోదీ అయోధ్య పట్టణంలో దాదాపు నాలుగు గంటలపాటు ఉంటారని సమాచారం.

శనివారం జరిగిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సమావేశంలో ఆగస్టు 3 లేదా ఆగస్టు 5 తేదీలలో భూమిపూజ జరిపేందుకు నిశ్చయించామని, ఏరోజున మోదీకి వీలవుతుందో చూడాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దాంతో ఆగస్టు 5 తేదీని పీఎంవో ఖరారు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఆగస్టు 5 న కశ్మీర్ నుంచి సెక్షన్ 370 ని  తొలగించిన ఆరోజుకు గుర్తుగా ఈ తేదీని ఖరారు చేసినట్లు భావిస్తున్నారు. మొదటి నుంచి ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి భూమిపూజలో పాల్గొనాలని ట్రస్ట్ కోరుకుంటున్నది. భూమిపూజ అనంతరం శ్రీరామ్ ఆలయ పనులు ప్రారంభమవుతాయి. 

గుడి నిర్మాణంలో 10 కోట్ల కుటుంబాల నిధులు

ప్రతిపాదిత ఆలయం పరిమాణం, రకానికి సంబంధించి చాలా ముఖ్యమైన నిర్ణయాలను ట్రస్ట్ సమావేశంలో తీసుకున్నారు. గతంలో ప్రతిపాదిత ఆలయం 128 అడుగుల ఎత్తు ఉండగా, ఇప్పుడు దాని ఎత్తును 33 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఇంతకుముందు ప్రతిపాదించిన 3 గోపురాలకు బదులుగా 5 గోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. దేవాలయ నిర్మాణంలో దేశ ప్రజలంతా పాలుపంచుకునేలా 10 కోట్ల కుటుంబాల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించారు. అలాగే, ఈ ఆలయ నిర్మాణం మూడున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని  నిర్ణయించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ట్రస్ట్ సమావేశానికి మీడియాను దూరంగా ఉంచారు. సమావేశం అనంతరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు తెలిపారు.


logo