బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:42:42

అయోధ్యకు చేరిన ఎస్పీజీ.. భద్రత కట్టుదిట్టం

అయోధ్యకు చేరిన ఎస్పీజీ.. భద్రత కట్టుదిట్టం

లక్నో :  అయోధ్యలో రామ ఆలయానికి ఈ నెల 5న ప్రధాని మోడీ భూమిపూజ చేయనుండగా, ప్రముఖులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచగా..  స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) శనివారం పట్టణానికి చేరుకుంది. ప్రధాని సందర్శనలో 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నాలుగువేల మంది పోలీసులను మోహరించాలని యూపీ పోలీసులు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా వేడుకలో ఏర్పాట్లు ఉండేలా ఆరోగ్య, శానిటరీ అధికారుల ప్రత్యేక బృందాలు సైతం శనివారం అయోధ్యకు చేరుకున్నాయి.

ముఖ్యంగా రామ జన్మభూమి ప్రాంగణంలో అర్చకుడితో పాటు 16 పోలీసులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు బృందాలను నియమించారు. వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ప్రజల కదలికలను పరిమితం చేస్తూ అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఎస్పీజీ సిద్ధంగా ఉండగా, భద్రతా, ఇతర ఏర్పాట్లను సమీక్షించేందుకు యూపీ డీజీపీ, చీఫ్‌ సెక్రెటరీతో పాటు సీనియర్‌ అధికారులంతా అయోధ్యలోనే ఉన్నారు. ఇప్పటికే అయోధ్యలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న, కొవిడ్‌-19 నెగెటివ్‌ పోలీసు సిబ్బందిని మాత్రమే ప్రధాని, ఇతర వీవీఐపీలు అయోధ్య సందర్శనలో నియమించాలని నిర్ణయించారు.

ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు యూపీ డీజీపీ హితేష్‌ చంద్ర అవాస్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లోపలి భద్రతా వలయాన్ని ఎస్పీజీ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అలాగే పది కంపెనీలకు చెందిన ప్రావిన్షియల్ సాయుధ కాన్స్టాబులరీ (పీఏసీ), కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఏపీఎఫ్‌)ను మోహరించనున్నారు. భద్రతలో భాగంగా జిల్లా సరిహద్దులను మూసివేయడం, ట్రాఫిక్‌ కదలికలను అరికట్టనున్నారు. పట్టణ పరిధిలో 75కుపైగా అడ్డంకులు ఏర్పాటు చేయనున్నారు. ‘పంచకోసి’ పరిక్రమ ప్రాంతం (రామ జన్మభూమికి ఐదు కిలోమీటర్ల వ్యాసార్థం) మూసివేయనున్నారు. అయోధ్యలోకి ప్రవేశించే రోడ్లపై మొత్తం ఆంక్షలు అమలులో ఉంటాయి.

అయోధ్యను ఆనుకొని ఉన్న 9 జిల్లాలో కూడా భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అయోధ్య, నేపాల్‌తో సరిహద్దును పంచుకునే బస్తీ డివిజన్‌లో ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఐజీ అనిల్‌కుమార్‌ అన్ని ఏర్పాట్లను సమీక్షించి, ఆగస్టు 5న అయోధ్యకు వెళ్లవద్దని బస్తీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాలపై, జలమార్గాలపై నిఘాను అత్యున్నత స్థాయికి పెంచారు. 4వ తేదీ నుంచి అయోధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయనున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo