బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:21:09

మద్దతుతోపాటు డిమాండ్లు.. సీఎం గెహ్లాట్‌కు బీటీపీ లేఖ

మద్దతుతోపాటు డిమాండ్లు.. సీఎం గెహ్లాట్‌కు బీటీపీ లేఖ

జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్, ఆయనకు మద్దతుగా ఉన్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. మరోవైపు బలాల సమీకరణ వ్యూహాల్లో కాంగ్రెస్, బీజేపీ నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్నట్లు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) తెలిపింది. ఈ మేరకు శనివారం ఆయనకు ఒక లేఖ అందజేసింది. పనిలోపనిగా తమ డిమాండ్లను కూడా అందులో ప్రస్తావించింది.

అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే తమ పార్టీ దూరంగా ఉంటుందని ఇటీవల బీటీపీ చెప్పింది. ఆ మేరకు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు లేఖలు రాసింది. అయితే బీటీపీకి చెందిన ఎమ్మెల్యేలు తొలి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఇటీవల సీఎం గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా తమ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికేనని బీటీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం గెహ్లాట్‌కు మద్దతు ప్రకటించడంతోపాటు తమ డిమాండ్లను ప్రస్తావిస్తూ ఒక లేఖ రాసింది.


logo