శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 22:54:13

స‌రిహ‌ద్దు వివాదంపై మ‌రోసారి చ‌ర్చ‌లు

స‌రిహ‌ద్దు వివాదంపై మ‌రోసారి చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్ తూర్పు ప్రాంతంలో నెల‌కొన్న సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా మధ్య మ‌రోసారి క‌మాండ‌ర్ల స్థాయి చర్చలకు రెండు దేశాల సైనికాధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు క‌మాండ‌ర్ల స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. జూన్ 6న తొలిసారి ఇరుదేశాల‌కు చెందిన క‌మాండ‌ర్లు భేటీ అయి చ‌ర్చ‌లు జ‌రిపినా జూన్ 15, 16 తేదీల్లో మ‌రోసారి ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. దీంతో జూన్ 22న రెండోసారి సమావేశమై స‌రిహ‌ద్దు వివాదంపై చర్చించారు. అయినా చైనా బ‌ల‌గాలు ల‌ఢ‌ఖ్ నుంచి పూర్తిగా వైదొల‌గ‌క పోవ‌డంతో  మంగ‌ళ‌వారం మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మయ్యారు. 

మంగళవారం ఉదయం 10.30 గంటలకు రెండు దేశాల కమాండర్ స్థాయి అధికారులు మూడోసారి భేటీ కానున్నారు. గల్వాన్ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చలు జరుగనున్నాయి. అయితే, గతంలో రెండు సార్లు కూడా వాస్తవాధీన రేఖ ఆవ‌లివైపు చైనా భూభాగంలోని మోల్దోలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ సారి మాత్రం భారత్‌వైపున ఉన్న ప్రాంతంలో చ‌ర్చ‌లు జరుగనున్నట్లు సమాచారం. 

గల్వాన్ ఘర్షణ ప్రాంతం నుంచి చైనా దళాలను ఉపసంహరించుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని భారత్ కోరుతుండగా.. చైనా సైన్యం మొండిగా వ్యవహరిస్తున్నది. ల‌ఢ‌ఖ్‌‌లోని గల్వాన్ లోయ సమీపంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం ఇరుదేశాల సైనికాధికారులు మ‌ళ్లీమ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. 


logo