కొవాగ్జిన్ బ్యాకప్ మాత్రమే: ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రస్తుతానికి ఓ బ్యాకప్లాగానే ఉంటుందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదివారం కొవాగ్జిన్‌తోపాటు సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్‌కు కూడా షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొవాగ్జిన్ ఇంకా మూడో దశ ప్రయోగాల్లో ఉన్నప్పుడే అనుమతి ఎలా ఇచ్చారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇన్ఫెక్షన్లు ఎక్కువైతేనే..
రానున్న రోజుల్లో సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్ ప్రధాన వ్యాక్సిన్‌గా ఉండబోతోందని రణ్‌దీప్ గులేరియా అన్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఓ బ్యాకప్‌గా ఉంటుందని, ఒకవేళ యూకే కరోనా వైరస్ వేరియంట్ తీవ్ర రూపం దాలిస్తే అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్‌ను వాడుతారని ఆయన చెప్పారు. ఆ లోపు భారత్ బయోటెక్ తమ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేసి తమ వ్యాక్సిన్ సమర్థత, భద్రతపై మరింత డేటాను చూపించే అవకాశం ఉంటుందని రణ్‌దీప్ అభిప్రాయపడ్డారు. తొలి కొన్ని వారాల పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్నే వేస్తారని, సీరమ్ దగ్గర ప్రస్తుతం 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్నదని ఆయన వెల్లడించారు.