శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 06:56:31

కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మూడో విడత ట్రయల్స్‌ భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ‘కొవాగ్జిన్‌’ పేరుతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ వ్యాక్సిన్‌ను రూపొందించిన సంస్థ.. తుది విడత ట్రయల్స్‌ను మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 22 కేంద్రాల్లో సుమారు 26వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే మొదటి, రెండో విడత ట్రయల్స్‌ టీకా ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. దీంతో మూడో దశ ప్రయోగాల కోసం ఇటీవల భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి, రెండో దశలో వెయ్యి మందికిపైగా ట్రయల్స్‌ జరగ్గా.. ఈ సారి పెద్ద మొత్తంలో 26వేల మందిపై ప్రయోగాలు చేపడుతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోంది.


ఇప్పటికే వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని నిమ్స్‌, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు మెడికల్‌ కాలేజీ, విశాఖ కింగ్‌జార్జ్‌ హాస్పిటల్‌లో ప్రయోగాలు జరుగుతున్నాయి. మూడో దశ ప్రయోగాల్లో పాల్గొనే వలంటీర్లను రెండు గ్రూపులుగా విభజించి ఇంట్రామాస్కులర్‌ ఇంజక్షన్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన అనంతరం వలంటీర్ల ఆరోగ్య పరిస్థితి, వారిపై కరోనా ప్రభావాన్ని ఏడాది పాటు పరిశీలించనున్నారు. నిర్వీర్యం చేసిన కొవిడ్‌ వైరస్‌ నుంచి ఈ వ్యాక్సిన్‌ తయారు చేసింది. దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మూడో విడత ట్రయల్స్‌లో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థగా భారత్‌ బయోటెక్‌ సంస్థ నిలిచింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.