గురువారం 28 జనవరి 2021
National - Sep 05, 2020 , 04:28:03

రెండోదశలోకి కొవాగ్జిన్‌

రెండోదశలోకి కొవాగ్జిన్‌

భారత్‌ బయోటెక్‌కు అనుమతులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం ‘భారత్‌ బయోటెక్‌' అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ (బీవీ152) టీకాకు కీలక అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ శుక్రవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు జాయింట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి.. భారత్‌ బయోటెక్‌కు లేఖ రాశారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ తొలి దశ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. 375 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. సోమవారం నుంచి రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. 380 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించనున్నారు. భారత్‌ బయోటెక్‌తోపాటు మనదేశానికి చెందిన మరో కంపెనీ జైడస్‌ క్యాడిలా కూడా హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నది.


logo