శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:26:02

'భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌' సేవలను ప్రారంభం

'భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌' సేవలను ప్రారంభం

ముంబై : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే మహారాష్ట్రలోని 'అకోల'లో "భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌" సేవలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అకోలా వశీం జిల్లాల ప్రజలు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సేవలు పొందవచ్చు. 'డిజిటల్‌ ఇండియా'లో భాగంగా, భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఉన్న ప్రాంతాల నుంచి 20 కి.మీ. పరిధిలో వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ అనుసంధానం జరగాలన్నది లక్ష్యం. 'టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పార్ట్‌నర్స్‌' (టీఐపీలు‌) సాయంతో అతి తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అందిస్తుండడం వల్ల, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.

స్థానిక వ్యాపార భాగస్వాముల ద్వారా, భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తుండడం వల్ల అకోలా, వశీం జిల్లాల ప్రజలు వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను త్వరగా పొందుతారు. మిగిలిన ఆపరేటర్లకు భిన్నంగా, అన్‌లిమిటెడ్‌ ఫ్రీ వాయిస్‌ కాలింగ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్నది. అకోలా, వశీం జిల్లాల ప్రజలకు అత్యాధునిక సాంకేతిక సేవలు అందించడంతోపాటు, టీఐపీలు మారేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అవకాశం కల్పిస్తున్నది. దీనివల్ల వారు నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొంది స్వావలంబన సాధిస్తారు. 'ఆత్మనిర్భర్‌ భారత్‌'లో భాగమవుతారు. మంచి ధరలో వేగవంతమైన ఇంటర్నెట్‌, వాయిస్‌ సేవలను 'భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌' కనెక్షన్‌ అందిస్తుంది.

100 ఎంబీపీఎస్‌ వరకు వేగం ఉంటుంది. వైర్డ్‌, వైర్‌లెస్‌లో అనేక ఆకర్షణీయ పథకాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో, నమ్మకమైన ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం సాధ్యమైంది. ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌ ఎఫ్‌టీటీహెచ్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ విజయవంతంగా అందిస్తున్నది. జులై నెలలో మహారాష్ట్రలో 15,000 ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్లను, దేశవ్యాప్తంగా 1,62,000 కనెక్షన్లను ఇచ్చింది. 'భారత్‌ ఎయిర్‌ ఫైబర్‌' సేవలను పొందాలని అకోలా, వశీం జిల్లాల ప్రజలకు సూచిస్తున్నది.


logo