గురువారం 16 జూలై 2020
National - Jun 25, 2020 , 01:34:09

చైనా సైబర్‌ అటాక్స్‌!

చైనా సైబర్‌ అటాక్స్‌!

  • కరోనా పేరిట హ్యాకర్ల సైబర్‌ దాడులు
  • అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక
  • కరోనా పేరిట హ్యాకర్ల సైబర్‌ దాడులు
  • అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక

న్యూఢిల్లీ: ఒకవైపు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. మరోవైపు సైబర్‌ దాడులకు సైతం కుట్రలు పన్నుతున్నది. దేశంలో సైబర్‌ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నతస్థాయి సంస్థ అయిన సీఈఆర్‌టీ-ఇన్‌ (కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఇండియా) ఇప్పటికే దీనిపై హెచ్చరికలు చేసింది. కరోనా నేపథ్యంలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తామంటూ హ్యాకర్లు తప్పుడు ఈమెయిల్స్‌ పంపిస్తారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరువొద్దని ప్రజలకు సూచించింది. ముఖ్యంగా [email protected] పేరుతో వచ్చే ఈమెయిల్స్‌ను అసలు తెరువొద్దని హెచ్చరించింది. చైనాకు చెందిన సైబర్‌ కేటుగాళ్ల చేతికి సుమారు 20 లక్షల ఈమెయిల్‌ అడ్రస్‌లు చిక్కాయని పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాలకు చెందిన ప్రజలందరికీ ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్లుగా వారు మెయిల్స్‌ పంపుతున్నట్లు తెలిపింది. తద్వారా అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు కుట్రలు చేస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన భద్రతా చర్యలను పాటించాల్సిన అవసరం ఉన్నది.

జాగ్రత్తగా పరిశీలించండి


హ్యాకర్లు ఈమెయిల్‌లో ‘gov.in’ అనే సఫిక్స్‌ వాడడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించినదని పొరబడే అవకాశం ఉన్నది. అలాంటి ఈమెయిల్స్‌ వచ్చినప్పుడు.. దాన్ని పరిశీలించకుండా తెరువడం గానీ, రిైప్లె ఇవ్వడం కానీ చేయకూడదు. ఫ్రీ, ఆఫర్స్‌, రివార్డ్స్‌, డిస్కౌంట్స్‌ అనే పదాలతో మెయిల్‌ వచ్చినప్పుడు.. ఆ సమాచారాన్ని, మెయిల్‌ అడ్రస్‌ను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. 

వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఇవ్వొద్దు


యూజర్లను ఊరించేలా హ్యాకర్లు ఫిషింగ్‌ ఈమెయిల్స్‌ పంపిస్తుంటారు. ఉచిత ప్రయోజనాలు కల్పిస్తామని, నిర్దిష్ట గడువులోగా మీ వివరాలు (ఐడీ, బ్యాంకు వివరాలు) పంపాలని అందులో కోరుతుంటారు. ఇలాంటి మెయిల్స్‌కు అసలు స్పందించకూడదు. వ్యక్తిగత, బ్యాంకులు వివరాలు పంపకూడదు. 

అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్‌ చేయొద్దు


ఇలాంటి చాలా ఈమెయిల్స్‌లో అటాచ్‌మెంట్స్‌ వస్తుంటాయి. మీకు సమాచారం అందించే ముసుగులో పీడీఎఫ్‌లు, ఇతర ఫైల్స్‌ పంపిస్తుంటారు. వాస్తవానికి వాటిలో మాల్‌వేర్‌ ఉంటుంది. అది మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్‌ అయి బ్యాగ్రౌండ్‌లో వర్క్‌ అవుతూ మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఈమెయిల్స్‌ వచ్చినప్పుడు అటాచ్‌మెంట్స్‌ తెరువొద్దు. 

క్రాస్‌ వెరిఫికేషన్‌


ఒక్కోసారి సైబర్‌ మోసగాళ్లు అటాచ్డ్‌ లింక్స్‌లో అధికారిక వెబ్‌సైట్స్‌లాగానే భ్రమింపజేస్తుంటారు. వాటిని క్లిక్‌ చేసినప్పుడు వేరే సర్వర్‌కు కనెక్ట్‌ అయి మీ వ్యక్తిగత డేటా చోరీ అవుతుంది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి లింక్స్‌ ఓపెన్‌ చేసినప్పుడు, ఆ లింక్‌, అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఒకేలా ఉందో లేదో పరిశీలించుకోవాలి. లింక్‌ ప్రారంభంలో హెచ్‌టీటీపీఎస్‌ ట్యాగ్‌ ఉందో లేదో చూడాలి. మీరు ఓపెన్‌ చేసిన వెబ్‌పేజ్‌కు నిర్దిష్ట ధ్రువపత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. బ్రౌజర్‌ అడ్రస్‌ బార్‌కు ఎడమ వైపున ఈ సమాచారం లభిస్తుంది. 

ఫిషింగ్‌ ఈమెయిల్స్‌ వచ్చినప్పుడు అధికారులకు సమాచారమివ్వాలి. reportphishing.in ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. దీని ద్వారా ఆ సైట్లను, పంపిన వాళ్లను బ్లాక్‌ చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈమెయిల్‌ను ట్రాక్‌ చేయడం ద్వారా నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లను గుర్తించేందుకు వీలవుతుంది. logo