మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 11:15:04

వైజాగ్‌లో లీకైన బెంజిమిడ‌జోల్ ప్ర‌మాద‌క‌ర‌మా ?

వైజాగ్‌లో లీకైన బెంజిమిడ‌జోల్ ప్ర‌మాద‌క‌ర‌మా ?

హైద‌రాబాద్‌: విశాఖ‌ప‌ట్ట‌ణంలోని సైన‌ర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ ఫార్మ కంపెనీలో ఇవాళ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న జ‌రిగింది. పార్వాడలోని జేఎన్ ఫార్మా సిటీలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో .. కంపెనీ నుంచి బెంజిమిడ‌జోల్ గ్యాస్ లీకైన‌ట్లు అధికారులు గుర్తించారు.  ఇటీవ‌లే ఎల్జీ పాలిమ‌ర్స్‌లో స్టెరైన్ గ్యాస్ లీకైన విషాద ఘ‌ట‌న అంద‌రికీ తెలిసిందే. అయితే ఇవాళ లీకైన బెంజిమిడ‌జోల్‌ను.. హెటిరోసైక్లిక్ కాంపౌండ్‌గా గుర్తిస్తారు. యాంటీ హైప‌ర్‌టెన్సివ్ డ్ర‌గ్స్‌లో దీన్ని ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. యాంటీట్యూమ‌ర్‌, యాంటీఫంగ‌ల్‌, యాంటీపార‌సైటిక్‌, అన‌ల్జ‌సిక్‌, యాంటీవైర‌ల్‌, యాంటీహిస్ట‌మైన్ డ్ర‌గ్‌గా కూడా బెంజిమిడ‌జోల్‌ను వాడుతుంటారు.  

సీఎం స‌మీక్ష‌

ఇవాళ జ‌రిగిన గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెందారు.  ఆ ఇద్ద‌రూ ఆ కంపెనీలో షిఫ్ట్ ఆప‌రేట‌ర్లు అని తెలిసింది. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న ప‌ట్ల అధికారుల‌తో మాట్లాడారు. ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందార‌ని, మ‌రో న‌లుగురు గాయ‌ప‌డిన‌ట్లు సీఎంకు అధికారులు తెలియ‌జేశారు. ఒక‌రు వెంటిలేట‌ర్‌పై ఉన్న‌ట్లు వారు వెల్ల‌డించారు.  రాత్రి 11.30 స‌మ‌యంలో రియాక్ట‌ర్‌లో గ్యాస్ లీక్ కావ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు. వైజాగ్ జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీసు క‌మీష‌న‌ర్ ఘ‌ట‌నా స్థ‌లికి వెంట‌నే చేరుకున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఫ్యాక్ట‌రీని మూసివేశారు. రియాక్ట‌ర్ వింగ్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వ‌ల్ల దాని తీవ్ర‌త‌ స్వ‌ల్పంగానే ఉన్న‌ట్లు సీఎంకు అధికారులు చెప్పారు. 

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు .. గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.  మృతుల కుటుంబాల‌కు ఆయ‌న సంఘీభావం తెలిపారు. ఎల్‌జీ పాలీమ‌ర్స్ ఘ‌ట‌న మ‌ర‌వుక ముందే పార్వాడ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. బాధితుల‌కు ఉత్త‌మ వైద్య చికిత్స అందించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కోరారు. 

  


logo