మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 16:47:13

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు.. 8 జోన్లుగా బెంగ‌ళూరు

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు.. 8 జోన్లుగా బెంగ‌ళూరు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. బెంగ‌ళూరులో క‌రోనాను త‌రిమికొట్టేందుకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో సీఎం యెడియూర‌ప్ప నేతృత్వంలో మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించింది. 

కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం న్యాయ‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జేసీ మ‌ధుస్వామి మీడియాతో మాట్లాడారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా బెంగ‌ళూరు సిటీని 8 జోన్లుగా విభ‌జించాల‌ని సీఎం నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి జోన్ కు ఒక మంత్రి బాధ్య‌త వ‌హించి.. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తార‌ని చెప్పారు. ఈ చ‌ర్య‌ల్లో సీఎం రాజ‌కీయ కార్య‌ద‌ర్శి ఎస్ఆర్ విశ్వ‌నాథ్ కూడా భాగ‌స్వాములు అవుతార‌ని మ‌ధుస్వామి పేర్కొన్నారు. 

గురువారం సాయంత్రం వ‌ర‌కు క‌ర్ణాట‌క‌లో 28,877 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసుల్లో బెంగ‌ళూరు అర్బ‌న్ నుంచి 12,509 కేసులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. తాలుకా, జిల్లా స్థాయి ఆస్ప‌త్రుల్లో కూడా క‌రోనా టెస్టులు చేసేందుకు త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. కొవిడ్ బెడ్ల‌ను పెంచేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.   


logo