గురువారం 09 జూలై 2020
National - Feb 03, 2020 , 17:47:14

బెంగాల్‌లో దారుణం.. అక్కాచెల్లెళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారు..

బెంగాల్‌లో దారుణం.. అక్కాచెల్లెళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారు..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ గంగారామ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఫతా నగర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తాళ్లతో కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. తీవ్రంగా చితకబాదారు. స్మృతి కోన దాస్‌, సోమా దాస్‌ అనే ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లు. స్మృతి కోన దాస్‌ టీచర్‌ కాగా, సోమా.. వీరి తల్లితో కలిసి ఇంట్లోనే ఉంటుంది. అయితే వీరి ఇంటి ముందు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు.. 12 ఫీట్ల స్థలం వదలాలి అని అక్కాచెల్లెళ్లను గ్రామ పెద్దలు కోరారు. దీనికి వారు అంగీకరించారు. మొదట చెప్పినట్లు కాకుండా.. 12 ఫీట్ల స్థలానికి బదులుగా 24 ఫీట్ల స్థలం ఇవ్వాలని శుక్రవారం గ్రామ పెద్దలు డిమాండ్‌ చేశారు.

రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన వాహనాలను అక్కాచెల్లెళ్లు అడ్డుకున్నారు. తాము భారీగా నష్టపోతున్నామని వారు వాపోయారు. దీంతో కోపం తెచ్చుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు.. స్మృతి మోకాళ్లకు తాళ్లు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. సోదరిని అడ్డుకునేందుకు వచ్చిన సోమాపై కూడా దాడి చేశారు. ఈ ఘటనను అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి వైరల్‌ చేశారు. ఈ ఘటనపై తృణమూల్‌ జిల్లా అధ్యక్షులు ఆర్పిత ఘోష్‌ స్పందించారు. ఫతా నగర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు అమల్‌ సర్కార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అక్కాచెల్లెళ్లు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo