బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 14:54:15

బీజేపీ అధ్య‌క్షుడి కాన్వాయ్‌పై దాడి

బీజేపీ అధ్య‌క్షుడి కాన్వాయ్‌పై దాడి

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు గురువారం దాడి చేశారు. ఈ ఘ‌ట‌న బెంగాల్‌లోని అలీపుర్దౌర్ జిల్లాలో చోటు చేసుకుంది. దిలీప్ ఘోష్‌తో పాటు క‌ల్చిని ఎమ్మెల్యే విల్స‌న్ కూడా ఉన్నారు. ఈ దాడిలో ఎమ్మెల్యే స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. దాడి వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది తెలియ‌లేదు. అయితే ఇటీవ‌లే దిలీప్ ఘోష్ తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించారు. తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు వారి దారిన వారు వెళ్ల‌క‌పోతే.. ఆస్ప‌త్రిని లేదా శ్మ‌శాన వాటిక‌ను చూడాల్సి ఉంటుంద‌ని దిలీప్ హెచ్చ‌రించారు. 

ఈస్ట్ మిడ్నాపూర్‌లోని హల్దియా ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల‌ జ‌రిగిన స‌మావేశంలో దిలీప్ ఘోష్ పాల్గొని ప్ర‌సంగించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను రాష్ర్ట పోలీసుల‌తో నిర్వ‌హించేది లేదు..  కేంద్ర బ‌లగాల ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను హింసిస్తున్న తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు త‌మ తీరును మార్చుకోవాల‌న్నారు. లేని ప‌క్షంలో వ‌చ్చే ఆరు నెల‌ల్లో తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌ల చేతులు, కాళ్లను విర‌గొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. అప్పుడు ఆస్ప‌త్రికి లేదా శ్మ‌శాన‌వాటిక‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని దిలీప్ ఘోష్ హెచ్చ‌రించారు.