బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 13:37:02

దేశానికి బెంగాలీలు ఎంతో చేశారు: ప్ర‌ధాని మోదీ

దేశానికి బెంగాలీలు ఎంతో చేశారు: ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ ఉత్స‌వాల‌ను ఇవాళ‌ ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. కోల్‌క‌తాలో ఓ మండ‌పాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తి స‌మ‌యంలో దేశాన్ని బెంగాల్‌ ముందు ఉండి న‌డిపించింద‌‌న్నారు.  దుర్గాపూజా ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న బెంగాలీ భాష‌లో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ దుర్గా పూజ సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్నామ‌ని, భ‌క్తులంద‌రూ స‌మ‌య‌మ‌నం చూపించార‌ని, ప్ర‌జ‌ల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నా.. భ‌క్తిలో కానీ, వైభవంలో కానీ త‌క్కువేమీ లేద‌న్నారు. ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న వారిలో సంతోషం, ఆనందానికి కొద‌వ‌లేద‌న్నారు. అస‌లైన బెంగాల్ ఇదే అని ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో తెలిపారు. కోవిడ్ వేళ రెండు గ‌జాల దూరాన్ని పాటించాల‌ని, క‌చ్చితంగా ఎల్ల‌వేళ‌లా మాస్క్‌లు ధ‌రించాల‌న్నారు. 

దూర్గా పూజ వేళ దేశం త‌న ఐక్య‌త‌ను, బ‌లాన్ని చాటుతుంద‌ని, ఇటువంటి సాంప్ర‌దాయం, సంస్కృతి బెంగాలీల‌కు చెందుతుంద‌న్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం శ‌ర‌వేగంగా తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర పోరులో బెంగాల్ కీల‌క పాత్ర పోషించింద‌న్నారు. గురుదేవులు ర‌వీంద్ర‌నాథ్ టాగోర్‌, బంకిమ్ చంద్ర ఛ‌ట‌ర్జీలు ఆత్మ‌నిర్బ‌ర్ సందేశం వినిపించార‌న్నారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో బెంగాలీల పాత్ర విశేష‌మైంద‌ని, అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా వారు దేశాన్ని ముందు ఉండి న‌డిపించార‌న్నారు.  దేశానికి మార్గ‌నిర్దేశం చేశార‌న్నారు. బెంగాల్‌కు చెందిన అనేక మంది ప్ర‌ముఖులు ఉన్నార‌న్నారు. వారి పేర్లు రోజంతా చ‌దివినా స‌రిపోద‌న్నారు. దేశాన్ని స‌క్ర‌మ‌మైన మార్గంలో న‌డిపేందుకు వారు ఎంతో స‌హ‌క‌రించార‌న్నారు.