శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 11:34:00

అంత‌రిక్ష రంగంలో భార‌త్‌ బ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతుంది : ఇస్రో చైర్మ‌న్‌

అంత‌రిక్ష రంగంలో భార‌త్‌ బ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతుంది : ఇస్రో చైర్మ‌న్‌

హైద‌రాబాద్‌: భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ సంస్థలు కూడా పాల్గొనేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇవాళ భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం చీఫ్ కే శివ‌న్ స్పందించారు. అంత‌రిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థ‌ల‌ను ఆహ్వానించ‌డం వ‌ల్ల‌.. యావ‌త్ దేశం స్పేస్ టెక్నాల‌జీ లాభాల‌ను పొందుతుంద‌ని శివ‌న్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు భాగ‌స్వామ్యుల రాక‌తో అంత‌రిక్ష రంగం వృద్ధి వేగ‌మ‌వుతుంద‌ని, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త ప‌రిశ్ర‌మ కీల‌కంగా మారుతుంద‌ని శివ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

అంత‌రిక్ష రంగంలో ప్రైవేటు వారికి అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల టెక్నాల‌జీ రంగంలో ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న భారీ స్థాయిలో పెరుగుతుంద‌ని శివ‌న్ తెలిపారు. దాంతో భార‌త్‌.. గ్లోబ‌ల్ టెక్నాల‌జీలో బ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతుంద‌న్నారు. దీర్ఘ‌కాలిక‌మైన సామాజిక ఆర్థిక సంస్క‌ర‌ణలు, అంత‌రిక్ష సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం వ‌ల్ల‌.. భార‌త్ అభివృద్ధిలో రోద‌సి ఆధారిత సేవ‌లు మెరుగ‌వుతాయ‌ని శివ‌న్ చెప్పారు.  ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో అంత‌రిక్ష కార్య‌క‌లాపాల్లో.. భార‌త్ స‌మ‌ర్థ‌వంత‌మైన దేశంగా మారుతుంద‌ని ఇస్రో చీఫ్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

దీని కోసం కేంద్ర ప్ర‌భుత్వం అటాన‌మ‌స్ నోడ‌ల్ ఏజెన్సీని ఆమోదించింద‌ని, ఇండియ‌న్ నేష‌న‌ల్ స్పేస్‌, ప్ర‌మోష‌న్ అండ్ ఆథ‌రైజేష‌న్ సెంట‌ర్ పేరుతో కార్య‌క్ర‌మాలు చేప‌డుతార‌ని శివ‌న్ తెలిపారు. అంత‌రిక్ష రంగంలో పెట్టుబ‌డులు పెట్టేవారికి అనుమ‌తులు ఇవ్వ‌డం లాంటి నిర్ణ‌యాలు ఆ ఏజెన్సీ చూసుకుంటుంద‌న్నారు. అంత‌రిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీల కార్య‌క‌లాపాల‌పైన కూడా ఆ ఏజెన్సీ నిఘా పెడుతుంద‌న్నారు.  అంత‌రిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రైవేటు కంపెనీల‌కు ఇస్రో త‌న సాంకేతిక నిపుణ‌త‌ను అంద‌జేస్తుంద‌ని శివ‌న్ చెప్పారు.

 logo