గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 01:42:10

సుదీర్ఘ యుద్ధానికి ఆరంభమిది

సుదీర్ఘ యుద్ధానికి ఆరంభమిది

-సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు

-జనతా కర్ఫ్యూపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘సుదీర్ఘ కాలం పాటు సాగే యుద్ధంలో ఇది తొలి అడుగు’ అని అభివర్ణించారు. ‘సుదీర్ఘ కాలం సాగే యుద్ధంలో జనతా కర్ఫ్యూ ప్రారంభం మాత్రమే. ఎటువంటి సవాల్‌నైనా సమిష్టిగా ఎదుర్కోగలమని దేశ ప్రజలు రుజువు చేశారు. ఒకసారి మేం నిర్ణయించుకుంటే ఎటువంటి సవాల్‌నైనా కలిసి ఎదుర్కొనే సామర్థ్యం ఉందని ప్రకటించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘సంకల్పం, సహనంతో మనకు మనం విధించుకున్న స్వీయ నిర్బంధం (సామాజిక దూరం).. సుదీర్ఘ కాలం సాగే యుద్ధంలో ఒక భాగం’ అని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్‌పై పోరులో దేశంలోని తల్లులు జరిపిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. జనతా కర్ఫ్యూ విజయవంతమైనందుకు తన తల్లి హీరాబెన్‌ గంట కొడుతున్న వీడియోను మోదీ ట్యాగ్‌ చేశారు. ‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, భద్రతా జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా తదితర వర్గాల వారు కరోనాపై పోరాటానికి మీ దీవెనలు ప్రోత్సాహం’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు జనతా కర్ఫ్యూ రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. అలాగని మనం సంబురాలు చేసుకోవచ్చని కాదు’ అని వ్యాఖ్యానించారు. స్వయంగా విధించుకున్న కర్ఫ్యూను విజయంగా పరిగణించలేమన్నారు. ఈ సందర్భంగా  దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ముందు వరుసలో నిలిచిన ప్రతి పౌరుడికి నా ధన్యవాదాలు. దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రజలకు మోదీ గురువారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 


logo
>>>>>>