ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 08:17:10

మోదీ జిందాబాద్‌ అనలేదని ఆటో డ్రైవర్‌పై దాడి

మోదీ జిందాబాద్‌ అనలేదని ఆటో డ్రైవర్‌పై దాడి

జైపూర్‌ : మోదీ జిందాబాద్‌, జై శ్రీరామ్‌ అని నినదించలేదని ఓ ఆటో డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని శిఖర్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గఫర్‌ అహ్మద్‌ కచ్చావా అనే ఆటో డ్రైవర్‌ శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రయాణికులను ఓ గ్రామంలో దింపి శిఖర్‌కు తిరిగి బయల్దేరాడు. మార్గమధ్యలో ఓ ఇద్దరు వ్యక్తులు గఫర్‌ ఆటోను ఆపి పొగాకు అడిగారు. ఆటో డ్రైవర్‌ పొగాకు ఇచ్చినప్పటికీ ఆ ఇద్దరు తిరస్కరించారు. మోదీ జిందాబాద్‌, జైశ్రీరామ్‌ అని నినాదాలు చేయాలని గఫర్‌పై ఒత్తిడి తెచ్చారు.

ఈ నినాదాలు చేసేందుకు డ్రైవర్‌ నిరాకరించడంతో.. అతనిపై దాడి చేశారు. డ్రైవర్‌ వద్ద ఉన్న చేతి గడియారం, డబ్బులను దొంగిలించారు. ముఖంపై దాడి చేయడంతో ఎడమ కన్ను పూర్తిగా కమిలిపోయింది. ఈ క్రమంలో బాధితుడు గఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. నిందితులను శాంభూ దయాల్‌ జాట్‌(35), రాజేంద్ర జాట్‌(30)గా పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్‌పై దాడి జరిపిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. logo