బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 20:46:05

దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ప్రధాని మోదీ జాతినుద్దేశించి  ప్రసంగిస్తూ..ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. కోవిడ్‌-19 ప్రపంచదేశాలను వణికిస్తోంది. రెండో ప్రపంచయుద్దం కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నాం. రెండు నెలలుగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రెండో ప్రపంచయుద్ధం వల్ల కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది ఇపడలేదు. ప్రజలంతా వ్యక్తి  పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్ని సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టేందుకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పడే ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. అందరం చేయి చేయి కలిపి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా కబలిస్తున్న దేశాల్లో మొదట బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నా..రాను రాను సంఖ్య పెరిగిపోతుందని ప్రధాని అన్నారు. 

ఒంటరిగా ఉండటంతో కరోనాకు చెక్‌..

కరోనా వ్యాప్తి చెందకుండా దేశ ప్రజలంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. సంకల్పం, కనీస జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు. ఎవరికి వారు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లే.. కరోనా నివారణకు ప్రపంచదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒంటరిగా ఉండటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చన్నారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనాను ఎదుర్కొనేందుకు మన ముందున్న మార్గాలు ఒకటి దృఢ సంకల్పం, రెండోది కలిసి పనిచేయడమని ప్రధాని మోదీ అన్నారు.

వృద్ధులను బయటకు వెళ్లనీయొద్దు..

వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలంతా బాధ్యతలు గుర్తించి మనకు రాకుండా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలని ప్రధాని సూచనలు చేశారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లనీయరాదని సూచించారు. మాకు ఏమీ కాదన్న నిర్లక్ష్యం, నీకే కాకుండా నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికే నష్టమన్నారు. 


logo