బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 01:19:49

పెన్షనర్లకు భారీ ఊరట

పెన్షనర్లకు భారీ ఊరట

  • పెన్షన్ల మంజూరు మరింత సరళతరం
  • బ్యాంకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, మే 16: దేశంలోని లక్షల మంది పెన్షనర్లకు కేంద్రంఊరట కల్పించింది. ప్రస్తుత పెన్షన్ల మంజూరు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ బ్యాంకులకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. జాయింట్‌ అకౌంట్‌ ఉన్నపెన్షనర్‌ చనిపోతే వారి భాగస్వామి ‘ఫాం 14’ను సమర్పించనవసరం లేదని సి బ్బంది, వ్యక్తిగత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పెన్షన్లు మంజూరు చేసే బ్యాంక్‌ శాఖల్లో మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందన్నది. పిల్లలు శాశ్వత వికలాంగులైతే కొత్తగా మళ్లీ ధ్రువీకరణ పత్రం అవసరం లేదన్నది. కాగా, ఒకవేళ కుటుంబ పెన్షన్‌ వికలాంగ చిన్నారికి మంజూరైతే, ఆ వికలాంగత్వం తాత్కాలికంగా ఉంటే ప్రతి ఐదేండ్లకోసారి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఆధార్‌ ఆధారిత డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ‘జీవన్‌ ప్రమాణ్‌'ను పెన్షన్‌ మంజూరు చేసే బ్యాంక్‌ శాఖలు తప్పక అంగీకరించాలని ఆదేశించింది. బ్యాంకర్లతోపాటు పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ శాఖ విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ మార్పులు చేసింది. ‘ఇకపై పెన్షన్ల మంజూరు లేదా పెన్షనర్ల నుంచి వివిధ రూపాల్లో ధ్రువపత్రాలను కోరే ప్రక్రియ సరళతరంగా ఉంటుంది. ఈ మేరకు సూచించిన కొత్త విధానాలను బ్యాంకులు అమలు చేస్తాయి’ అని సదరు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సెంట్రల్‌ పెన్షన్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీపీసీ)/ బ్యాంక్‌ శాఖలకు మారిన నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 65.26 లక్షల మంది ఉన్నారు.


logo