ఆదివారం 31 మే 2020
National - May 17, 2020 , 02:11:49

‘రక్షణ’లో ఎఫ్‌డీఐలు పెంపు

‘రక్షణ’లో ఎఫ్‌డీఐలు పెంపు

  • 49 శాతం నుంచి 74 శాతానికి.. పలు ఆయుధాల దిగుమతిపై నిషేధం
  • అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేట్‌కు భాగస్వామ్యం
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 16: మోదీ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’కు ఊపునిచ్చేందుకు రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అలాగే పలు రకాల ఆయుధాల దిగుమతిని నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. వీటిని దేశీయంగానే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి నాలుగో విడుత వివరాలను ఆమె శనివారం వెల్లడించారు. దిగుమతి చేసుకునే కొన్ని విడిభాగాలను దేశీయంగా తయారు చేస్తామని, వీటికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఈ చర్యల వల్ల రక్షణ దిగుమతుల వ్యయం భారీగా తగ్గనుందని చెప్పారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరేటీకరిస్తామని, దీని వల్ల వాటి నిర్వహణ మెరుగుపడుతుందని వివరించారు. స్టాక్‌ మార్కెట్‌లో వాటిని లిస్ట్‌ చేస్తామని చెప్పారు. కార్పొరేటీకరణ అంటే ప్రైవేటీకరణ కాదని స్పష్టంచేశారు. నిర్దిష్ట వ్యవధిలో రక్షణ కొనుగోళ్లు చేపట్టేందుకు, వేగంగా నిర్ణయాలను తీసుకునేందుకు ‘ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ)’ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి74 శాతానికి పెంచుతామన్నారు. 

రీసెర్చ్‌ రియాక్టర్‌..

మెడికల్‌ ఐసోటోప్‌ల ఉత్పత్తికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రీసెర్చ్‌ రియాక్టర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల క్యాన్సర్‌, ఇతర వ్యాధులకు అందుబాటు ధరలో చికిత్స అందించేందుకు వీలవుతుందని చెప్పారు. అలాగే ఆహార సంరక్షణ కోసం ఇర్రేడియేషన్‌ సాంకేతికతను ఉపయోగించి పీపీపీ పద్ధతిలో సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మరోవైపు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి ‘వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌)’ కింద రూ.8,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 

అంతరిక్షరంగంలో ప్రైవేట్‌కూ సమాన అవకాశాలు

భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేట్‌ రంగానికీ భాగస్వామ్యం కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవల విషయంలో ప్రైవేట్‌ సంస్థలకూ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు వాటికి అనుమతి ఇస్తామని తెలిపారు. గ్రహాన్వేషణ, ఔటర్‌ స్పేస్‌ ప్రయాణాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లో ప్రైవేట్‌ సంస్థలకూ భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. 


logo