ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 16:11:55

ముంబై కంపెనీని చేజిక్కించుకున్న బైజూస్

 ముంబై కంపెనీని చేజిక్కించుకున్న బైజూస్

బెంగళూరు : ప్రముఖ ఎడ్యు టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్... ఇప్పుడు అదే రంగంలోని పోటీ సంస్థలఫై కన్నేసింది. తన సొంత ప్లాట్ ఫామ్ కు మరింత విలువ జోడించగల ఎడ్యు టెక్ కంపెనీల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే డెకాకార్న్ క్లబ్ (10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలను ఇలా పిలుస్తారు) లో చేరిపోయిన బైజూస్ వద్ద రూ వేల కోట్ల ఇన్వెస్టర్ల నిధులు ఉన్నాయి. దీంతో ఆ నిధులతో ఒక వైపు సొంత  ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేస్తూ, విస్తరిస్తూనే .. మరోవైపు విద్య రంగంలో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీలను సొంతం చేసుకోవటం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవటంతో పాటు పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే బైజూస్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ కంపెనీ ని కొనుగోలు చేస్తున్నది. ముంబై కేంద్రంగా 2018 లో వైట్ హాట్ జూనియర్ ను కరణ్ బజాజ్ స్థాపించారు. ఈ కంపెనీ కే-12 సెగ్మెంట్ లో పిల్లలకు ఆన్లైన్ లో కోడింగ్ పై శిక్షణ ఇస్తుంది. స్టూడెంట్స్ లో కోడింగ్ పై ఆసక్తి ని పెంపొందించటంతో పాటు వారు పూర్తిస్థాయిలో గేమ్స్, ఆనిమేషన్, మొబైల్ ఆప్స్ ను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తుంది. ఇవి కూడా వాణిజ్య పరంగా పనికొచ్చేలా ఉండటం విశేషం. దీంతో అనతి కాలంలోనే వైట్ హాట్ జూనియర్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా మహానగరాల్లో ఈ కంపెనీకి విపరీతమైన ప్రాచుర్యం ఏర్పడింది.

దీనిని ఏర్పాటు చేసిన కరణ్ బజాజ్ గతంలో డిస్కవరీ నెట్వర్క్స్ ఇండియా కు సీఈఓ గా వ్యవహరించారు. ఈ కంపెనీ సొంతంగా ప్రొప్రయిటరీ కోడింగ్ కరికులం రూపొందించింది. దీంతో ఆన్లైన్ లో ఇంటరాక్టివ్ క్లాసులు చెప్పేందుకు అనుకూలంగా ఉంతున్నది. వైట్ హాట్ జూనియర్ దాదాపు 150 మిలియన్ డాలర్ల (సుమారు రూ 1,125 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఏర్పాటు చేసిన రెండేండ్ల లోనే వైట్ హాట్ జూనియర్ సాధించిన ప్రగతి ని చూసి... బైజూస్ మనసుపారేసుకుంది. అందుకే వెంటనే ఈ కంపెనీని చేజిక్కించుకోవాలని పావులు కదిపింది.

సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 2,250 కోట్లు) చెల్లించి వైట్ హాట్ జూనియర్ ను సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడింది. అయితే అందులో డీల్ సైజు వెల్లడించలేదు. ప్రస్తుత లావాదేవీ ప్రకారం వైట్ హాట్ జూనియర్ కు నగదు రూపంలోనే నిధులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. డీసీ అడ్వైసర్స్ అనే సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది.

 

 


logo