సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 14:41:29

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన ఎంఎం జోషి

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన ఎంఎం జోషి

లక్నో: అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట గురువారం హాజరయ్యారు. కోర్టు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వాంగ్మూలాన్ని స్పెషల్ జడ్జి ఎస్ కే యాదవ్ రికార్డ్ చేయించారు. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం ఇదే పద్ధతిలో రికార్డ్ చేసే అవకాశం ఉన్నది.

వివాదాస్పద నిర్మాణం కూల్చివేత కేసు విచారణ సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్నది. ఈ కేసులో 32 మంది వాంగ్మూలాలను సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద రికార్డ్ చేసే దశలో ఉన్నది. ఈ సమయంలో వారిపై ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను తిరస్కరించే అవకాశం లభిస్తుంది.

అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణాన్ని 1992 డిసెంబర్ 6న కరసేవకులు కూల్చివేశారు. ఈ స్థలంలో పురాతన రామాలయం ఉండేదని కరసేవకులు పేర్కొంటున్నారు. రామాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో అద్వానీ, జోషి ఉన్నారు.


logo