ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 30, 2020 , 08:09:39

బాబ్రీ కేసులో నేడు తీర్పు.. రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం

బాబ్రీ కేసులో నేడు తీర్పు.. రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం

లక్నో: బాబ్రీ మసీదు కూల్చి‌వేత కేసులో ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానం ఈరోజు తీర్పు వెల్ల‌డిం‌చ‌ను‌న్నది. 1992 డిసెం‌బర్‌ 6న కర‌సే‌వ‌కులు అయో‌ధ్య‌లోని బాబ్రీ మసీ‌దును కూల్చి‌వే‌శారు. దీనిపై న‌మోదైన కేసు 28 ఏండ్ల‌పాటు విచార‌ణ కొన‌సాగింది. ఈ కేసులో బీజేపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ‌మ‌నో‌హ‌ర్‌‌జోషి, పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉమా భారతి, వినయ్‌ కతి‌యార్‌, సాధ్వి రితం‌బర, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మాజీ సీఎం కల్యా‌ణ్‌‌సింగ్ స‌హ మొత్తం 49 మందిని సీబీఐ  నింది‌తు‌లుగా చేర్చింది. తీర్పు స‌మ‌యంలో నింది‌తు‌లంతా కోర్టులో హాజ‌రు‌కా‌వా‌లని న్యాయ‌మూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ నెల 16న ఆదే‌శిం‌చారు.

కాగా, ప్ర‌స్తుతం ఉమా భార‌తి, క‌ల్యాన్ సింగ్‌ల‌కు క‌రోనా సోక‌డంతో వారు ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌ధాన నిందుతుల్లో ఒక‌రైన 92 ఏండ్ల ఎల్‌కే అధ్వానీ వ‌యోభారంతో ఉన్నారు. దీంతో ముగ్గురు అగ్ర‌నేత‌లు కోర్టుకు హాజ‌ర‌య్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉన్న‌ది. మ‌రో 17 మంది ఇప్ప‌టికే మ‌ర‌ణించారు. సున్నిత‌మైన కేసు కావ‌డంతో కేంద్ర హోంశాఖ అప్ర‌మ‌త్త‌మైంది. తీర్పు వెలువ‌డిన త‌ర్వాత ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌ల‌ను చోటుచేసుకోవ‌ద్ద‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. 

1992లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత సంద‌ర్భంగా జరిగిన ఘ‌ర్ష‌నల వ‌ల్ల దేశ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఈ ఘ‌ట‌న త‌ర్వ‌త దేశ రాజ‌కీయాల్లో మార్పులు చోటుకున్నాయి.