శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 21:57:02

బాబా రామ్‌దేవ్‌.. మీ కరోనా మందును ఇప్పుడే తేకండి..

బాబా రామ్‌దేవ్‌.. మీ కరోనా మందును ఇప్పుడే తేకండి..

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసినట్లు యోగా గురు బాబా రామ్‌దేవ్ వెల్లడించిన మరుసటి క్షణమే.. ఆ మందును ఇప్పుడే మార్కెట్లో తేకండంటూ భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు సూచించింది. మీ మందుపై పూర్తి అధ్యయనం చేసి అనుమతించే వరకు ఎలాంటి ప్రకటనలు కూడా ఇవ్వొద్దంటూ ఆదేశించింది.

కరోనా వైరస్ నివారణకు ఔషధమైన 'కరోనిల్' ను మార్కెట్లో ప్రవేశపెట్టడం గురించి యోగా గురు బాబా రామ్‌దేవ్ మంగళవారం హరిద్వార్లో మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఆయుర్వేద పద్ధతిని ఉపయోగించి మూలికలపై విస్తృతమైన అధ్యయనం, పరిశోధనల అనంతరం ఈ ఔషధాన్ని తయారు చేసినట్లు బాబా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. అంతేకాదు, తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో రోగులకు 100 శాతం ప్రయోజనం ఇచ్చిందని వెల్లడించారు. త్వరలోనే పతంజలి ఈ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయనున్నదని చెప్పారు. 

అయితే, పతంజలి తయారుచేసిన 'కరోనిల్' ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సాయంత్రం పతంజలి సంస్థకు ఆదేశాలు జారీచేసింది. పరీక్షలు నిర్వహించేందుకు ఔషధం యొక్క పూర్తి కూర్పును అందజేయాలని సూచించింది. అంతేకాకుండా ఈ ఔషధంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు దాని ప్రచారాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వం పతంజలికి తెలిపింది. ఔషధాన్ని మొదట శాస్త్రీయంగా పరీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం, ఈ ఔషధం గురించి మంత్రిత్వ శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు.

పతంజలి ఏమంటోందంటే..

కరోనా వైరస్ సంక్రమణను అధ్యయనం చేసిన తరువాత, పలు మూలికల సహాయంతో ఈ ఔషధాన్ని తయారు చేసినట్లు పతంజలి సంస్థ చెబుతోంది. మొదటి దశ పరిశోధన విజయవంతమైందని పతంజలి తరపున బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ ఔషధం ప్రధానంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి పనిచేస్తుందని వెల్లడించారు. కరోనిల్ నుంచి 3 రోజుల్లో 69% మంది రోగులు కోలుకున్నారని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని చెప్పారు. ఈ మందు శ్వాసకోశ వ్యవస్థను బలపరుస్తుందని, వ్యాప్తిని నిర్మూలించిందని పేర్కొన్నారు.


logo