శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 14:26:58

‘అయోధ్య అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి’

‘అయోధ్య అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి’

హైదరాబాద్‌ : అయోధ్యలోని రామాలయం చుట్టూ 70 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరింది. సంప్రదాయ నగర శైలిలో నిర్మిస్తున్న ఆలయాన్ని స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ రూపకల్పన చేయగా.. ఆలయం చుట్టు పక్కల సౌకర్యాల కోసం తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సూచనలు కోరింది. ఈ వారం ప్రారంభంలో ఆలయ నిర్మాణ పురోగతిపై ట్రస్ట్‌ సభ్యులు సమావేశమై చర్చించారు. పుష్కరిణి, యజ్ఞ, అనుష్టాన, కల్యాణ మండపాలు రామ్‌ జన్మోత్సవం, హన్మాన్‌ జయంతి, రామ్‌చార్చ తదితర ఆచారాలు, వేడుకల కోసం ఆలయంలో అనుబంధంగా నిర్మించేందుకు స్వచ్ఛంద ప్రాతిపదికన ట్రస్ట్‌ ప్రజల నుంచి సలహాలు, సూచనలతో పాటు డిజైన్లను కోరింది.

అలాగే 51 మంది విద్యార్థులు, వారి గురువుల కోసం నివాస సౌకర్యాలతో గురుకులం కోసం సైతం డిజైన్లను ఆహ్వానించింది. నల్‌ నీల్‌ తిలా, సీతాకి రసోయి, కుబేర్‌ తిలా, అగంద్‌ తిలా వంటి ప్రదేశాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ప్రధాన, పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం రోజుకు సగటున లక్ష మంది, గరిష్ఠ రోజుల్లో ఐదు లక్షల మందికి సరిపోయేలా డిజైన్లను కోరింది. అలాగే శ్రీరామ్‌ డిజిటల్‌ లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు మల్టీ మీడియా ప్లాట్‌ఫాంలు, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీతో రామాయణ సారాంశాన్ని ఒకేసారి వెయ్యి నుంచి 5వేల మంది వ్యక్తులు వీక్షించేలా ఆడిటోరియం కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది.

ట్రస్ట్‌ గుర్తింపు పొందిన వీఐపీలు, పూజలకు గౌషాలా, నివాస సౌకర్యాలు కల్పించాలని ట్రస్ట్‌ యోచిస్తోంది. ఈ మేరకు డిజైన్లు ఇవ్వాలని కోరింది. ఆగస్ట్‌ 20న రామాలయ నిర్మాణం ప్రారంభమైందని, ఇంజినీర్లు ఆ స్థలంలో మట్టిని పరీక్షిస్తున్నారని ట్రస్ట్‌ పేర్కొంది. పురాతన, సంప్రదాయ నిర్మాణ పద్ధతులకు కట్టుబడి ఆలయాన్ని నిర్మిస్తామని ట్రస్ట్‌ స్పష్టం చేసింది. భూకంపాలు, తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.