మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:24:21

టీవీలో వేడుక

టీవీలో  వేడుక

  • ఆన్‌లైన్‌లో అయోధ్య భూమిపూజ ప్రసారం 
  • కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి లేదు 
  • టీవీల్లోనే చూడాలి: యూపీ సీఎం పిలుపు 
  • అద్వానీ, జోషీలు కూడా ఆన్‌లైన్‌లోనే 
  • వేదికపై ప్రధానితోపాటు ఐదుగురే 

లక్నో/అయోధ్య, ఆగస్టు 1: ప్రపంచంలోని హిందువులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భక్తులకు దక్కటం లేదు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుండటంతోపాటు అయోధ్యలో కరోనా కేసుల కలకలంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమిపూజ జరిగే ఈ నెల 5వ తేదీన (బుధవారం) అయోధ్యలో ప్రజలెవరూ గుమికూడరాదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. భూమిపూజ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందున అందరూ టీవీల్లోనే చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళ, బుధవారాల్లో సమీప ఆలయాల్లో దీపాలు వెలిగించాలని, రామాయణాన్ని పఠించాలని సూచించారు. ఆలయంలో ఓ పూజారితోపాటు 14మంది భద్రతాసిబ్బందికి రెండురోజుల క్రితం కరోనా సోకటంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, అయోధ్య రామాలయం కోసం జీవితమంతా పోరాడిన బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకావటంలేదని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూమిపూజ కార్యక్రమం వేదికపై ప్రధాని నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, రామజన్మభూమి న్యాస్‌ అధ్యక్షుడు నృత్యగోపాల్‌దాస్‌తోపాటు మరో ఇద్దరు మాత్రమే ఉంటారని వెల్లడించాయి.


భద్రతకు యువ పోలీసులే 

భూమిపూజ కార్యక్రమానికి భద్రత కల్పించే భద్రతా సిబ్బందిలో 45 ఏండ్ల లోపు వారు మాత్రమే ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నామని అయోధ్య ఎస్‌ఎస్‌పీ తెలిపారు. కరోనా పరీక్షలు చేసిన తర్వాతే భద్రతా సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. 

భారతీయులందరి 

సమ్మతితోనే గుడి: కాంగ్రెస్‌ 

అయోధ్య రామాలయ నిర్మాణ ఘనత పూర్తిగా బీజేపీకే దక్కే పరిస్థితులు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ రంగంలోకి దిగింది. భారతీయులందరి ఆమోదంతోనే రామాలయం నిర్మాణమవుతున్నదని ఆ పార్టీ సీనియర్‌నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అన్నారు. 

అమెరికాలో ఉత్సవాలకు సన్నద్ధం 

అయోధ్య రామాలయం భూమిపూజ కార్యక్రమాన్ని భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఉత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని హిందూ మందిర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కాన్ఫరెన్స్‌ (హెచ్‌ఎంఈసీ), హిందూ మందిర్‌ ప్రీస్ట్స్‌ కాన్ఫరెన్స్‌ (హెచ్‌ఎంపీసీ) సంస్థలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఐదోతేదీన అమెరికా, కెనడా, కరీబియన్‌ దీవుల్లో ఆన్‌లైన్‌ ప్రార్థనలు నిర్వహించనున్నట్టు ఈ సంస్థలు ప్రకటించాయి.


logo