శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 25, 2020 , 01:37:53

48 గంటల్లో ఇల్లు

48 గంటల్లో ఇల్లు

  • త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో అద్భుతం
  • సాధారణ నిర్మాణాలకు తీసిపోని నాణ్యత
  • కాంచీపురంలో 106 గంటల్లో జీ+1 ఇల్లు
  • 700 ఎస్‌ఎఫ్టీలో నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ
  • త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో  ఇండ్ల నిర్మాణంలో సమూల మార్పులు

తీడీ ప్రింటింగ్‌ అంటే ఏమిటి?

సాంకేతికంగా దీనిని త్రీడీ కన్‌స్ట్రక్షన్‌ ప్రింటింగ్‌ (త్రీడీసీపీ)గా పిలుస్తారు. 1950 నుంచీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నా.. 1995లో జోసెఫ్‌ పెగ్నా, బెహ్‌రాక్‌ కొష్నెవిక్‌ అనే ఇంజినీర్లు వేర్వేరు పద్దతుల్లో త్రీడీ ప్రింటెడ్‌ ఇండ్ల నిర్మాణ సాంకేతికతను ఆవిష్కరించారు. త్రీడీ కన్‌స్ట్రక్షన్‌ ప్రింటింగ్‌లో సంప్రదాయ కాంక్రీట్‌, సిమెంట్‌తోపాటు వాక్స్‌, ఫోమ్‌, పాలిమర్‌ వంటి కృత్రిమ పదార్థాలను కూడా వాడుతారు కాబట్టి సాధారణ ఇంటికంటే త్రీడీ ప్రింటెడ్‌ ఇల్లు దృఢంగా ఉంటుంది. ఈ ఇండ్ల నిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి. మొదటిది కంప్యూటర్‌లో భవనాన్ని డిజైన్‌ చేయటం. రెండోది నిర్మాణానికి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేయటం. మూడో దశలో క్రేన్‌లాంటి యంత్రంతో భవనం గోడలను, అప్పటికే సిద్ధంచేసి ఉంచిన పైకప్పును తీసుకొచ్చి అమరుస్తారు. 

పేదల ఇండ్ల నిర్మాణాలు వేగవంతం

దేశంలో ఇప్పటికీ కోట్ల మంది పక్కా సొంత ఇల్లు లేని పేదలున్నారు. అందుకే 2022 నాటికి దేశంలో 6 కోట్ల పక్కా ఇండ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం వాడుతున్న పద్దతుల్లో ఇంటిని నిర్మించటానికి ఎంత వేగంగా పనిచేసినా రెండుమూడు నెలల సమయం పడుతుంది. కానీ.. త్రీడీ ప్రింటెడ్‌ టెక్నాలజీతో మూడునాలుగు రోజుల్లోనే ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వవచ్చని ఎల్‌ అండ్‌ టీ (బిల్డింగ్స్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ సతీశ్‌ చెప్పారు. గతేడాది 240 చదరపు అడుగుల్లో ఇదే సంస్థ తొలిసారి త్రీడీ ప్రింటెడ్‌ ఇంటిని నిర్మించింది. వరదలతో ఇండ్లు కోల్పోయే బాధితులకు త్రీడీ విధానంలో రెండు రోజుల్లోనే పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వవచ్చు. 

పిల్లర్స్‌తోనూ కట్టొచ్చు

పిల్లర్స్‌తో కూడా త్రీడీ ఇండ్లను నిర్మించవచ్చు. ఉక్కు కడ్డీలను వెల్డింగ్‌ చేసి బేస్‌మెంట్‌పై పిల్లర్స్‌గా నిలబెడతారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ప్రత్యేక యంత్రం ఆ పిల్లర్స్‌ను కూడా ఏకకాలంలో కాంక్రీట్‌తో నింపుతుంది. సాధారణ ఇండ్లలాగా ముందుగా పిల్లర్స్‌ నిర్మించి తర్వాత గోడలు కట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే ఒక చిన్న, మధ్యతరగతి కుటుంబానికి అవసరమయ్యే ఇంటిని ఈ టెక్నాలజీతో రెండుమూడు రోజుల్లోనే నిర్మించవచ్చు. విదేశాల్లో ఇటుకలతో కూడా త్రీడీ ఇండ్లు నిర్మిస్తున్నారు. ముందుగా సిద్ధంచేసిన ఇటుకలను కంప్యూటర్‌లో డిజైన్‌ చేసినట్టుగా యంత్రం గోడలుగా నిర్మిస్తుంది. త్రీడీ ఇండ్ల నిర్మాణానికి అయ్యే వ్యయం కూడా అటూఇటుగా సాధారణ ఇండ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 

సాంకేతికత అన్నిరంగాల్లోనూ విప్లవం సృష్టిస్తూ..  మనిషి జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నది. తాజాగా భవన నిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సంచలనంగా మారింది. ప్రయోగాల దశలోనే ఉన్న ఈ విధానం వాణిజ్యపరంగా పరుగులు పెట్టేందుకు ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తున్నది. తాజాగా దేశంలోనే తొలిసారి 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండస్తుల (గ్రౌండ్‌ ఫ్లోర్‌+ మొదటి అంతస్తు) త్రీడీ ఇల్లు నిర్మాణమైంది. ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ లార్సన్‌ అండ్‌ టర్బో (ఎల్‌ అండ్‌ టీ) ఈ ఘనత సాధించింది. తమిళనాడులోని కాంచీపురంలో త్రీడీ ప్రింటింగ్‌తో కేవలం 106 గంటల్లోనే పటిష్ఠమైన ఇంటిని నిర్మించింది.