శనివారం 28 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 17:09:29

సుప్రీంకోర్టుపై అనుచిత ట్వీట్లు.. క‌మెడియ‌న్ కునాల్‌పై క్రిమిన‌ల్ కేసు

సుప్రీంకోర్టుపై అనుచిత ట్వీట్లు.. క‌మెడియ‌న్ కునాల్‌పై క్రిమిన‌ల్ కేసు

హైద‌రాబాద్‌: క‌మెడియ‌న్ కునాల్ క‌మ్రా న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై చేసిన ట్వీట్లు వివాదాస్ప‌దం అయ్యాయి.  సుప్రీంకోర్టు దేశంలో ఓ జోక్‌గా మారింద‌ని ఆయ‌న బుధ‌వారం ట్వీట్ చేశారు.  జ‌ర్న‌లిస్టు అర్న‌బ్ గోస్వామికి బెయిల్ ఇచ్చిన నేప‌థ్యంలో సుప్రీం న్యాయ‌మూర్తుల్ని కునాల్ త‌ప్పుప‌ట్టారు.  ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు న్యాయ‌వాదులు.. క‌మెడియ‌న్ కునాల్‌పై నేరాభియోగం కింద కోర్టు విచార‌ణ చేప‌ట్టాలంటూ అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ అనుమ‌తి కోరారు. సుప్రీంకోర్టును కించ‌ప‌రుస్తూ వ్యాఖ్య‌లు చేసిన కునాల్‌ను విచారించాలంటూ అటార్నీ వేణుగోపాల్ ఇవాళ అనుమ‌తి ఇచ్చారు.  జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఓ ఫ్ల‌యిట్ అటెండెంట్ అని, ఓ ఫస్ట్ క్లాస్ ప్ర‌యాణికుడికి ఆయ‌న చాంపేన్ స‌ర్వ్ చేసిన‌ట్లు కునాల్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు.  సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల పేరు ముందు హాన‌ర‌బుల్ అన్న ప‌దాన్ని తీసివేయాలంటూ కునాల్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఈ ట్వీట్ల‌ను త‌ప్పుప‌డుతూ ముంబైకి చెందిన లాయ‌ర్ రిస్వామ్ సిద్దిక్ ఇవాళ అటార్నీ జ‌న‌ర‌ల్‌ను ఆశ్ర‌యించారు.  క‌మెడియ‌న్ పై క్రిమిన‌ల్ నేరాభియోగం కింద విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు.