మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 04, 2020 , 02:46:33

‘అటల్‌ టన్నెల్‌' అందుబాటులోకి

‘అటల్‌ టన్నెల్‌' అందుబాటులోకి

 • ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ 
 • సైన్యం తరలింపునకు కీలకం కానున్న టన్నెల్‌ 
 • ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగం

న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లోని పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగం ‘అటల్‌ టన్నెల్‌'ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. తూర్పు లఢక్‌ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో దేశ రక్షణపరంగా ఎంతో కీలకమైన ‘అటల్‌ టన్నెల్‌' అందుబాటులోకి రావడంపై రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణపరంగా ఈ టన్నెల్‌కు ఎంతో వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది.  ఈ సొరంగ మార్గం ద్వారా సైనిక వాహనాల్లో జవాన్లను, సామాగ్రిని త్వరితగతిన తరలించవచ్చు. శీతాకాలంలో మంచు కురుస్తుండటంతో మనాలీ-లేహ్‌ల మధ్య మార్గాన్ని ఏటా ఆరు నెలల పాటు మూసి వేసేవారు. ఈ టన్నెల్‌ అందుబాటులోకి రావడంతో ఇక ఆ ఇబ్బంది ఉండబోదు. మరోవైపు, ఈ సొరంగం మనాలీ-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. 

అటల్‌ టన్నెల్‌ విశేషాలు

 • ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రోడ్డు మార్గం. పొడవు 9.02 కిలోమీటర్లు
 • టన్నెల్‌ నిర్మాణ వ్యయం రూ. 3,300 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభంలో రూ. 950 కోట్లను అంచనా వ్యయంగా అనుకున్నారు. 
 • ఈ టన్నెల్‌ నిర్మాణానికి వైజాగ్‌ స్టీల్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ -ఆర్‌ఐఎన్‌ఎల్‌) 8,500 టన్నులకు పైగా స్టీల్‌ను సరఫరా చేసింది.
 • సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తు. పీర్‌పంజల్‌ పర్వత సానువుల్లో అత్యాధునిక నైపుణ్యాలతో నిర్మాణం. 
 • గుర్రపు డెక్క ఆకారంలో ఉండేలా నిర్మించిన ఈ సొరంగంలో రెండు వరుసల రహదారి ఉంది. 
 • సొరంగం వెడల్పు 8 మీటర్లు. ప్రతీరోజు 3 వేల కార్లు, 1500 ట్రక్కులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా టన్నెల్‌ను డిజైన్‌ చేశారు.
 • టన్నెల్‌లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి 60 మీటర్లకు ఒక ఫైర్‌ హైడ్రాంట్‌. 
 •  ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ కోసం ప్రతి 150 మీటర్ల దూరంలో ఒక టెలిఫోన్‌. 
 •  ప్రతి 500 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌  (అత్యవసర మార్గం). 
 • ప్రతి 250 మీటర్లకు సీసీ కెమెరా.
 • ప్రతి 2.2 కిలోమీటర్లకు వెలుతురు  ప్రసరించే వ్యవస్థ. 
 • ప్రతి కిలోమీటరుకు గాలి నాణ్యత కొలిచే వ్యవస్థ.

ఎప్పుడు - ఎలా?

 • 2000, జూన్‌ 3 - వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో సొరంగ నిర్మాణానికి నిర్ణయం
 • 2002, మే 26 - టన్నెల్‌ నిర్మాణానికి శంకుస్థాపన. ఆరేండ్లలో పూర్తి చేయాలని నిర్ణయం. పలు కారణాలతో ఆలస్యం.
 • 2019, డిసెంబర్‌ 24 - రోహ్‌తంగ్‌ టన్నెల్‌గా ఉన్న పేరును అటల్‌ టన్నెల్‌గా మార్పు
 • 2020, అక్టోబర్‌ 03 - అటల్‌ టన్నెల్‌ ప్రారంభం