శనివారం 04 ఏప్రిల్ 2020
National - Jan 25, 2020 , 02:59:19

హిందూరాజ్యంగా భారత్‌!

హిందూరాజ్యంగా భారత్‌!
  • మోదీ హయాంలో మారిపోతున్న దేశం
  • మోదీపై ప్రముఖ దాత, పెట్టుబడిదారుడు జార్జ్‌ సొరోస్‌ విమర్శలు
  • ప్రఖ్యాత మ్యాగజైన్‌ ‘ది ఎకనమిస్ట్‌' కథనం
  • భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పును కలుగజేస్తాయి
  • ఆయన విధానాలు రక్తపాతానికి దారితీస్తాయి

దావోస్‌/న్యూఢిల్లీ: నరేంద్రమోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత మ్యాగజైన్‌ ‘ది ఎకనమిస్ట్‌' ఈ మేరకు మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తలెత్తనుందని హెచ్చరించింది. మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ దాత, పెట్టుబడిదారుడు జార్జ్‌ సొరోస్‌ కూడా దావోస్‌ వేదికగా మోదీపై ధ్వజమెత్తారు.  


రాజకీయ విషం..

సహనశీల, భిన్నమతాలకు నిలయమైన భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ‘ది ఎకనమిస్ట్‌' మ్యాగజైన్‌ వ్యాఖ్యానించింది. భారత్‌లో పౌరసత్వ సవరణచట్టం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై సమీక్ష చేస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ విధానాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదపడొచ్చుకానీ, దేశానికి అవి ‘రాజకీయ విషం’గా మారుతాయని ఆరోపించింది. సీఏఏ తదితర మోదీ విధానాలు రక్తపాతానికి దారితీస్తాయని హెచ్చరించింది. మతం, జాతీయత గుర్తింపుపై విభజన తీసుకురావడం, ముస్లింలు ప్రమాదకరమంటూ పదేపదే పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ.. తన మద్దతుదారులను పెంచుకోవడంలోనూ, దేశ ఆర్థిక దుస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలోనూ బీజేపీ విజయవంతమైందని వివరించింది. ప్రతిపాదిత ‘జాతీయ పౌర జాబితా’ (ఎన్నార్సీ) కాషాయ పార్టీ విభజన ఎజెండాకు మరింత దోహదపడనుందని తెలిపింది. ఈక్రమంలో మోదీ దేశంలో 80 శాతం ఉన్న హిందువులకు రక్షకుడిగా తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిరంతరం ఒకవర్గాన్ని పీడించడం అందరికీ ముప్పు గా మారుతుందని, రాజకీయ వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించింది. హిందువులను రెచ్చగొట్టడం, ముస్లింలను ఆగ్రహానికి గురిచేయడం ద్వారా బీజేపీ కొత్తగా రక్తపాతాన్ని సృష్టించవచ్చని ఆందోళనవ్యక్తం చేసింది. 


పడగవిప్పుతున్న జాతీయవాదం

ప్రధాని మోదీపై జార్జ్‌ సొరోస్‌ తీవ్ర విమర్శలు చేశారు. దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో జాతీయవాదం పడగ విప్పుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోదీ దేశాన్ని హిందూ రాజ్యాన్ని మారుస్త్తున్నారు. కశ్మీర్‌పై కఠిన ఆంక్షలు విధించారు. లక్షలాది మంది ముస్లింల పౌరసత్వం లాగేసుకుంటామని బెదిరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పైనా సొరోస్‌ విమర్శలు గుప్పించారు. ఆయన ప్రపంచం మొత్తం తన చుట్టూనే తిరిగాలని కోరుకుంటారన్నారు. రాజ్యాంగ పరిధులను ఆయన అతిక్రమించారని, ఇప్పుడు అభిశంసనను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 


logo