శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 16:22:58

మద్యం సేవించడంలో ఈ రాష్ట్ర మహిళలే టాప్‌

మద్యం సేవించడంలో ఈ రాష్ట్ర మహిళలే టాప్‌

న్యూఢిల్లీ: మద్యం సేవించడంలో అసోం రాష్ట్ర మహిళలు అందరి కంటే టాప్‌లో ఉన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2019-20 డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోల్చితే 15 నుంచి 49 ఏండ్ల వయసున్న అసోం మహిళల్లో 26.3 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. మేఘాలయలో ఇది 8.7 శాతం ఉన్నది. ఈ వయసు మహిళలు దేశవ్యాప్తంగా  మద్యం సేవిస్తున్నది 1.2 శాతం మాత్రమే. 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) 4 నివేదికలో ఈ గణాంకాలను పొందుపర్చారు. అయితే 2018-19లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 5 సర్వే నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉన్నది. 

మరోవైపు 2005-06లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 3 సర్వే నివేదిక ప్రకారం 15-49 ఏండ్ల వయసున్న అసోం మహిళల్లో మద్యం సేవించేవారి శాతం 7.5గా ఉన్నది. ఈ సర్వేలో అసోం కన్నా ఐదు రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌ (33.6%), సిక్కిం (19.1%), ఛత్తీస్‌గఢ్‌ (11.4%), జార్ఖండ్‌ (9.9%), త్రిపుర (9.6%) ముందున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 3లో అసోంలో మద్యం సేవించే మహిళల శాతం 7.5 శాతం ఉండగా సర్వే 4లో ఇది 26.3 శాతం పెరిగింది. మరోవైపు సర్వే 3లో టాప్‌లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ (3.3%), సిక్కిం (0.3%), ఛత్తీస్‌గఢ్‌ (0.2%), జార్ఖండ్‌ (0.3%), త్రిపుర (0.8%) గణాంకాలు తగ్గాయి.

దేశవ్యాప్తంగా వారానికి ఒకసారి మద్యం సేవించే మహిళలు 35 శాతం మంది ఉండగా అసోంలో 44.8 శాతం మంది ఉన్నారు. మరోవైపు 15-49 ఏండ్ల వయసున్న మగవారు అసోంలో 35.6 శాతం మంది మద్యం సేవిస్తుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వీరి సంఖ్య 59 శాతం ఉన్నది. పొగాకు వినియోగంలో కూడా దేశవ్యాప్త గణాంకాలతో పోల్చితే అసోం మహిళలు, పురుషులు 60%, 17.7% తో టాప్‌లో ఉన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.