శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 15:43:33

ప్రభుత్వ సహాయం లేకుండానే రూ. కోటితో బ్రిడ్జి నిర్మాణం

ప్రభుత్వ సహాయం లేకుండానే రూ. కోటితో బ్రిడ్జి నిర్మాణం

గువాహటి : వర్షాకాలం వచ్చిందంటే.. ఆ ప్రాంత ప్రజలు పడరాని కష్టాలు పడుతారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే చెక్కతో చేసిన బోట్లపై ప్రయాణించాలి. వరద ఉధృతి ఎక్కువైతే నదిలో కొట్టుకుపోయే పరిస్థితి. నిత్యావసర వస్తువులకు, పాఠశాలకు, ఆస్పత్రికి వెళ్లాలంటే ఆ నదిలోని దాటి వెళ్లాల్సిందే. ఆ నదిని ఒకట్రెండు గ్రామాలు కాదు.. దాటాల్సింది.. మొత్తం పది గ్రామాలు. నదిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ అధికారులు పెడ చెవిన పెట్టారు. ఒక వేళ అధికారులు హామీ ఇచ్చిన అవి నీటి మీద రాతలే అయ్యాయి. 

అసోం రాష్ట్రంలోని కామ్‌పూర్‌ జిల్లాలో జల్‌జలి నది ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ నదికి వరద పోటెత్తుతుంది. ఈ నదికి ఒక వైపున 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు, ఆస్పత్రికి, పాఠశాలలకు వెళ్లాలంటే ఆ నదిని దాటి పోవాల్సిందే. వారికి ఇంకో మార్గం లేదు. అది కూడా బోటు సహాయంతో. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బోటులో ప్రయాణం చేసేవారు. ఇక ప్రభుత్వాలు బ్రిడ్జి నిర్మించకపోవడంతో.. తామే నిర్మించుకోవాలని ఆ పది గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. 

ఈ పది గ్రామాల్లోని ప్రజల సంఖ్య 7 వేల మంది. వీరంతా కలిసి రూ. కోటి వరకు చందాలు వేసుకున్నారు. ప్రభుత్వ సహాయం లేకుండానే ఆ డబ్బుతో 335 మీటర్ల మేర చెక్క బ్రిడ్జిని నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. కాంక్రీట్‌ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు.


logo