ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 21:54:13

అక్కడ సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌

అక్కడ సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌

గౌహతి : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించేందుకు అసోం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు మానసికంగా సన్నద్ధమవుతున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ శనివారం పాత్రికేయులతో అన్నారు. నాలుగో తరగతి వరకు విద్యార్థులకు పాఠశాల ఉండదని, ఉపాధ్యాయులు సిబ్బందితో అందరు ఆగస్టు 30కి ముందు తప్పనిసరిగా కొవిడ్‌-19 పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. 5-8 తరగతుల విద్యార్థుల కోసం తరగతులను గ్రామక్షేత్రం, లేదా బహిరంగా ప్రదేశాల్లో నిర్వహించవచ్చు.

ఒకేసారి గరిష్టంగా 15 మంది విద్యార్థులు తరగతులకు హాజరుకావచ్చు. ఇవి ప్రాచీన కాలంనాటి గురుకులల్లా ఉంటాయని మంత్రి వివరించారు. విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా తరగతులు తీసుకొని ఉపాధ్యాయులకు సహాయం చేయవచ్చని చెప్పారు. దీనికి సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 9-12వ తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలో తమ క్యాంపస్‌లో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. 9, 11 తరగతుల విద్యార్థులకు వారానికి రెండు సార్లు, 10, 12 తరగతులకు వారానికి నాలుగు రోజులు తరగతులు ఉంటాయి. మూడు గంటల చొప్పున రెండు షిఫ్టులు ఉంటాయి. గరిష్ఠంగా 15 మంది విద్యార్థులను ఒకే గదిలో కూర్చోవడానికి అనుమతి ఇవ్వనున్నారు.

కళాశాలల విషయానికొస్తే, చివరి సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమీపంలోని కాలేజీల్లో తరగతులకు హాజరుకావచ్చు. విశ్వవిద్యాలయాల్లో తరగతుల ప్రవర్తనపై నిర్ణయం సంబంధిత వైస్ ఛాన్సలర్ తీసుకుంటారు. కాగా, కేంద్రం తీసుకొచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని మంత్రి శర్మ స్వాగతించారు. రాష్ట్రంలో అమలుకు బ్లూప్రింట్‌ సిద్ధం చేయడానికి ప్రభుత్వం 40 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.  అసోంలో ఇప్పటి వరకు 98 మరణాలతో సహా 40,269 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 9,811 క్రియాశీల కేసులు ఉన్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo