శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 11, 2020 , 12:57:35

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణంలో రూ.5.37కోట్లు స్వాధీనం

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణంలో రూ.5.37కోట్లు స్వాధీనం

గువాహటి : పోలీసుల నియామక కుంభకోణానికి సంబంధించి అసోం పోలీసులు శనివారం రాష్ట్రంలోని మూడు పశ్చిమ జిల్లాల నుంచి సుమారు రూ.5.37కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు రైల్వే సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ట్వీట్‌ చేశారు. ‘బొంగైగావ్, బార్పేట, చిరాంగ్ జిల్లాల్లో జరిపిన తనిఖీల్లో రూ.5,36,88,640 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ డబ్బు సీఐడీ కేసు నెం.21/2020 (ఎస్ఐ రిక్రూట్‌మెంట్‌ కేసు)కు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అసోం పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక కుంభకోణంపై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు క్రమంగా సంచలనాత్మక వివరాలను వెల్లడిస్తోందని, ఈ కేసులో ఇద్దరు ఈశాన్య సరిహద్దు రైల్వే ఉద్యోగులను కూడా అరెస్టు చేసినట్లు మరో పోలీస్‌ అధికారి తెలిపారు. ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆ రాష్ట్ర మాజీ పోలీసు డీఐజీ ప్రశాంత కుమార్ దత్తా, అధికార బీజేపీ నాయకుడు దిబన్ దేకాతో సహా 45 మంది నిందితులను అరెస్టు చేశారు. కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన దత్తాను అక్టోబర్‌ 6న భారత్‌-నేపాల్‌ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 30 రాత్రి బార్పేట జిల్లాలోని పచ్చచార్చుచి వద్ద పోలీసులకు లొంగిపోయిన వెంటనే దిబస్‌ దేకాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వారి గురించి సమాచారం అందించినందుకు అసోం పోలీసులు ఒక్కొక్కరికి రూ.లక్ష రివార్డు ప్రకటించారు. సెప్టెంబర్ 20న రాత పరీక్ష రద్దుకు దారితీసిన రిక్రూట్‌మెంట్‌ టెస్ట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ అసోం స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్‌ఎల్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ ప్రదీప్ కుమార్ గత నెలలో ఆ పోస్ట్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సీఎం సర్బానంద సోనోవాల్ ఆదేశాల మేరకు సీఐడీ, అసోం పోలీస్ క్రైం బ్రాంచ్‌ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాయి.

దర్యాప్తును డీజీపీ భాస్కరజ్యోతి మహంత వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత ప్రారంభమైన కొద్ది నిమిషాల తర్వాత సెప్టెంబర్ 20న ఎస్‌ఎల్‌పీఆర్‌బీ రాత పరీక్షను రద్దు చేసింది. అసోం పోలీసుశాఖలోని 597 సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రాత పరీక్ష కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 154 కేంద్రాల్లో 66వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం లీక్‌పై కాంగ్రెస్‌ ఆందోళన చేస్తోంది. సీఎం సర్బానంద సోనోవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.