మంగళవారం 26 మే 2020
National - May 11, 2020 , 08:55:18

అసోంలో ఇంటింటా కరోనా పరీక్షలు

అసోంలో ఇంటింటా కరోనా పరీక్షలు

గువాహటి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అసోం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 వేల గ్రామాల్లో జ్వరం, దగ్గు, సర్ది, శ్వాససంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో మే 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కొందరికి ఎలాంటి ప్రయాణ చరిత్ర, కాంటాక్ట్‌లు లేకపోయినప్పటికీ ప్రాణాంతక వైరస్‌ సోకడంతో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉండగా 29 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి, కొత్తగా కేసులు నమోదవ కుండా చూడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలను వేగవంతం చేసేలా ప్రభుత్వం ఈ వినూత్న ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వాశర్మ వెల్లడించారు. మే 7న ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఇప్పటివరకు 6809 గ్రామాల్లో నమూనాలు సేకరించామని తెలిపారు. దీంతోపాటు ప్రతి ఏడాది ఎండాకాలంలో వచ్చే జపనీస్‌ ఎన్‌సెఫిలిటిస్‌కు సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. మొత్తం మూడు కోట్ల మందిని పరీక్షిస్తామని, ఈ కార్యక్రమంలో 18 వందల మంది డాక్టర్లు, 43 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, టెక్నీషియన్లు పాలుపంచుకుంటున్నారని ఆయన చెప్పారు. 


logo