బుధవారం 27 జనవరి 2021
National - Jan 01, 2021 , 16:32:06

సిగ‌రెట్‌ల‌కు డ‌బ్బులు క‌ట్ట‌మన్నందుకు కారుతో గుద్దిచంపిన కానిస్టేబుల్‌!

సిగ‌రెట్‌ల‌కు డ‌బ్బులు క‌ట్ట‌మన్నందుకు కారుతో గుద్దిచంపిన కానిస్టేబుల్‌!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దారుణం జ‌రిగింది. సిగ‌రెట్‌ల‌కు డ‌బ్బులు క‌ట్ట‌మ‌న్నాడ‌న్న కోపంతో ఓ కానిస్టేబుల్ పాన్‌షాప్ య‌జ‌మానిని కారుతో గుద్దిచంపాడు. అందుకు కానిస్టేబుల్ ఇద్ద‌రు స్నేహితులు కూడా స‌హ‌క‌రించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉధ‌మ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాలోని బాజ్‌పూర్ ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బాజ్‌పూర్‌లో గౌరవ్ అనే వ్యక్తి పాన్‌షాప్ న‌డుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో పనిచేసే కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తన బావమరిది, స్నేహితుడితో కలిసి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గౌరవ్ పాన్ షాప్‌కు వెళ్లాడు. ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని దానికి ఇచ్చేందుకు నిరాకరించాడు. గౌరవ్ డ‌బ్బులు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. 

దాంతో ఇరుగుపొరుగు దుకాణాల‌వాళ్లు అక్క‌డికి చేరుకుని గొడ‌వ‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌టికే తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతున్న కానిస్టేబుల్, అత‌ని వెంట ఉన్న ఇద్ద‌రు కారులోఎక్కి వెళ్లిపోతున్న‌ట్టే వెళ్లి గౌరవ్‌ను కారుతో తొక్కించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన గౌర‌వ్‌ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అత‌ను అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. 

దాంతో స్థానికులు మృత‌దేహంతో బాజ్‌పూర్‌ పోలీస్‌స్టేష‌న్ ముందు బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందుతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళ‌న‌తో బాజ్‌పూర్ పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్న పోలీస్ ఉన్న‌తాధికారులు కానిస్టేబుల్ ప్ర‌వీణ్ స‌హా నిందితులు ముగ్గురిని అరెస్టు చేయించి జైలుకు పంపించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo