బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 03:34:50

చివరి బెంచీల్లో పైలట్‌

చివరి బెంచీల్లో పైలట్‌

  • బలపరీక్షలో నెగ్గిన గెహ్లాట్‌ 

జైపూర్‌, ఆగస్టు 14: చక్రం తిప్పినచోటే చేష్టలుడిగి కూర్చున్నాడు. అసెంబ్లీలో ముందువరుసలో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపించిన నేత ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సమీపంలో ఉన్న చివరివరుసకే పరిమితమైపోయాడు. శుక్రవారం రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ తిరుగుబాటునేత సచిన్‌పైలట్‌ పరిస్థితి ఇది. ఆయనను చూసి చేతకానివాడంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారు. అయితే యువనేత ఆ విమర్శలను దీటుగానే తిప్పికొట్టారు. శక్తిమంతమైన యోధులనే సరిహద్దుల రక్షణకు పంపుతారంటూ.. తన పరిస్థితిని సమర్థించుకున్నారు. 

గట్టెక్కిన గెహ్లాట్‌ సర్కారు

విశ్వాస పరీక్షలో అశోక్‌గెహ్లాట్‌ ప్రభుత్వం ఘనవిజయం సాధించింది. 200 స్థానాలున్న అసెంబ్లీలో అశోక్‌గెహ్లాట్‌ ప్రభుత్వానికి 125 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో యువనేత సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో నెలపాటు కొనసాగిన సంక్షోభానికి తెరపడింది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ప్రభుత్వమే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వివిధ అంశాలపై వాడివేడి చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. ‘ప్రభుత్వాలను కుట్రలతో కూలదోస్తున్నవారికి మా విజయం గట్టి సందేశాన్ని పంపింది’ అని గెహ్లాట్‌ ఈ సందర్భంగా అన్నారు. 


logo