శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:26:25

అసెంబ్లీ స‌మావేశానికి గెహ్లాట్ డిమాండ్‌... ఆందోళ‌నలు జ‌రిగితే సంబంధం లేదు

అసెంబ్లీ స‌మావేశానికి గెహ్లాట్ డిమాండ్‌... ఆందోళ‌నలు జ‌రిగితే సంబంధం లేదు

జైపూర్ : త‌క్ష‌ణ‌మే అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర్చాల్సిందిగా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో కొన‌సాగుతున్న రాజ‌కీయ ఆందోళ‌న‌ల మ‌ధ్య పార్టీ సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాన్ని కోరుకుంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు అసెంబ్లీ స‌మావేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ క‌ల‌రాజ్ మిశ్రాను కోరారు. గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై చర్చించటానికి వీలుగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామ‌న్నారు. 

గత రాత్రే అసెంబ్లీ సెషన్ కోసం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆశించాం. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. గ‌వ‌ర్న‌ర్ ఒత్తిడిలో ఉన్న‌ట్లు భావిస్తున్నామ‌న్నారు. తనకు మద్దతుగా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ రాజ్ భవన్‌కు చేరుకున్నారు. ప్రారంభంలో వీరంద‌రినీ రాజ్‌భ‌వ‌న్‌లోకి ప్రవేశించకుండా ఆపివేశారు. తరువాత మంత్రి శాంతి ధారివాల్, ఎమ్మెల్యే దివ్య మదర్నాను లోపలికి అనుమతించారు. గ‌వ‌ర్న‌ర్ ముందు పార్టీ ఎమ్మెల్యేల ప‌రేడ్ నిర్వ‌హించేందుకు స‌మ‌యం కోరిన‌ట్లు తెలిపారు.  

మంత్రి ప్రతాప్ సింగ్ క‌చారియావాస్ మాట్లాడుతూ... ఒక సీఎం తన మెజారిటీని నిరూపించుకోవటానికి ఉత్సాహం చూపిస్తుంటే గవర్నర్ అడ్డంకులు సృష్టిస్తుండటం దేశంలో బ‌హుశా ఇదే మొదటిసారి కావొచ్చ‌న్నారు. తాము మైనారిటీలో ఉన్నామని చెబుతున్న వారు త‌మ ముందుకు వ‌చ్చి మెజార్టీని ఛాలెంజ్ చేయాల్సిందిగా స‌వాల్ విసురుతున్న‌ట్లు తెలిపారు. త‌మ‌కు మెజార్టీ లేద‌ని వారు భావిస్తే ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కొనేందుకు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. గవర్నర్ తన రాజ్యాంగ విధిని ఎందుకు నిర్వ‌ర్తిస్త‌లేర‌న్నారు. 

మ‌రోవైపు బీజేపీ నాయకులు సతీష్ పూనియా, గులాబ్ చంద్ కటారియా, రాఘ‌వేంద్ర రాథోడ్ కూడా ఈ సాయంత్రం గవర్నర్‌ను కలవడానికి సమయం కోరారు. కరోనావైరస్ మహమ్మారి నేప‌థ్యంలో అసెంబ్లీ సమావేశ అభ్యర్థనను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా గెహ్లాట్ మీడియా స‌మావేశంలో తెలిపారు. ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం సీఎంఓకు తెలియ‌జేసింద‌న్నారు. కాగా ప్రభుత్వాలను కూల్చివేసే సంప్రదాయం రాజస్థాన్‌కు ఎప్పుడూ లేదన్న గెహ్లాట్ తాము ఫ్లోర్ టెస్ట్ కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. 

గవర్నర్‌తో మాట్లాడిన‌ట్లు తెలిపిన గెహ్లాట్ అసెంబ్లీని స‌మావేశ ప‌ర్చాల్సిందిగా మ‌రొక్క‌మారు అభ్య‌ర్థించిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యంలో ఆల‌స్యం చేయొద్ద‌న్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆదేశించాల్సిందిగా అడిగిన‌ట్లు చెప్పారు. తద్వారా ప్రతిదీ స్పష్టమవుతుంద‌న్నారు. ప్రభుత్వం స్థిరంగా ఉందని ప్రజలకు కూడా తెలుసు అని అన్నారు. స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌ని ప‌రిస్థితికి దారితీస్తే రాజ్‌భ‌వ‌న్ బ‌య‌ట జ‌రిగే ఆందోళ‌న‌ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్నారు. అది త‌మ బాధ్య‌త కాద‌న్నారు. పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇది మొత్తం బీజేపీ కుట్ర అన్నారు. రాజస్థాన్ ప్రజలు, ఎమ్మెల్యేలు అందరూ త‌మ‌తో ఉన్న‌ట్లు సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. 


logo