ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 20, 2020 , 19:35:15

ఇక మనదగ్గరే 'ఇంగువ‌' పంట.. దీంతో లాభాలెన్నో!

ఇక మనదగ్గరే 'ఇంగువ‌' పంట.. దీంతో లాభాలెన్నో!

ఆసాఫోటిడా.. దీనినే మనం హింగ్ (ఇంగువ) అని కూడా పిలుస్తాం. భారతీయ వంటకాల్లో ముఖ్యమైన మసాలా దినుసులలో ఇది ఒకటి. చాలా ఏండ్లుగా మన ఆహార సంస్కృతిలో భాగమైంది. ఆహారానికి టన్నుల కొద్ది రుచి, సుగంధాన్ని జోడిస్తుందనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. దాదాపు ప్రతి భారతీయుల ఇంటిలో హింగ్‌ను చూడొచ్చు. 

అన్ని రకాల వంటకాల్లో హింగ్‌ను వాడుతుండటంతో దీనికి భారీ డిమాండ్‌ పెరిగింది. ఇప్పటివరకు భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. మన దేశంలో కూడా దాని మూలాన్ని కనుగొని ఇక్కడే పండించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహాల్ లోయలో మసాలా దినుసులను పండించడానికి చొరవ తీసుకుంటున్నది. ఇప్పటివరకు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్యప్రాచ్య దేశాల నుంచి ప్రతి ఏటా దాదాపు 1200 టన్నుల ముడి ఆసాఫోటిడాను దిగుమతి చేసుకుంటున్నది. ఇందుకోసం మన దేశం సంవత్సరానికి సుమారు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఐహెచ్‌బీటీ భారతదేశంలోని ఫెర్యులా ఆసాఫోటిడా మొక్కల విత్తనాలను తీసుకువచ్చింది. ఇక్కడ వ్యవసాయం ప్రారంభించడానికి దాని వ్యవసాయ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అక్టోబర్ 15 న లాహౌల్ లోయలోని క్వారింగ్ గ్రామంలోని రైతు క్షేత్రంలో సీఎస్ఐఆర్-ఐహెచ్‌బీటీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా హింగ్‌ మొదటి విత్తనాన్ని నాటారు.

"సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ, పాలంపూర్ ప్రయత్నాల కారణంగా లాహాల్ లోయలో వ్యవసాయం చేస్తున్న రైతులు విస్తారంగా ఉపయోగించుకోవటానికి వీలుగా ఆసాఫోటిడా సాగును చేపడుతున్నది. ఈ ప్రాంతం యొక్క చల్లని ఎడారి పరిస్థితుల్లోని బంజరు భూముల విస్తరణ ఇందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నది"అని సీఎస్ఐఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌-ఐహెచ్‌బీటీ 2018 అక్టోబర్ నెలలో ఇరాన్ నుంచి ఆరు విత్తనాలను కొనుగోలు చేసింది. సెహాబ్, రిబ్లింగ్, లాహాల్, స్పిటీ, హెచ్‌పీలలో హింగ్ మొక్కలను పెంచింది. మొక్క చల్లని, పొడి వాతావరణ పరిస్థితులలో పెరుగుతుంది. అందుకని భారతీయ హిమాలయ ప్రాంతంలోని చల్లని ఎడారి ప్రాంతాలు దాని సాగు కోసం ఎంపిక చేశారు.

ఇంగువ‌తో లాభాలెన్నో..

* ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు నుంచి గ్యాస్‌ను బయటకు పంపడానికి ఉపకరిస్తుంది. 

* ఇది రక్తపోటు స్థాయిని తగిన ప్రమాణంలో ఉంచడానికి సహాయపడుతుంది.

* జలుబు, దగ్గు, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలపై పోరాటానికి సహాయపడతుంది.

* రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. మధుమేహ రోగులకు ప్రయోజనకారి.

* దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సాధారణ ఆరోగ్య సమస్యలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 

* చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.