హైదరాబాద్: ఆస్ట్రాజెన్‌కా తయారు చేస్తున్న కోవిడ్ టీకాను తీసుకుంటే.. ఆ పేషెంట్లలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఆ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడెన్‌తో పాటు ఆసియాలోనూ థాయిల్యాండ్ కూడా ఆ టీకా పంపిణీ ఆపేసింది. అయితే ఆస్ట్రాజెన్‌కా కోవిడ్ టీకా వల్ల ఉత్పన్నం అవుతున్న సైడ్ ఎఫెక్ట్స్‌పై గాఢమైన రీతిలో అధ్యయనం చేయనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఆస్ట్రాజెన్‌కా టీకా వల్ల కలుగుతున్న తీవ్ర పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఆ టీకా వేసుకోవడం వల్ల సంభవిస్తున్న మరణాలపై ఆరా తీస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. టీకా వల్ల ఏదైనా దుష్ ప్రభావం ఉన్నట్లు తేలితే ఆ విషయాన్ని వెల్లడిస్తామని కోవిడ్19 జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఎన్కే అరోరా తెలిపారు.