గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 03:13:29

అభివృద్ధే విజయసూత్రం!

అభివృద్ధే విజయసూత్రం!
  • ఆప్‌ విజయానికి అదే కారణం
  • కలిసొచ్చిన పథకాలు
  • అండగా నిలిచిన మహిళలు

న్యూఢిల్లీ:  అభివృద్ధే కేజ్రీవాల్‌ సర్కారుకు మరోసారి పట్టంకట్టింది. ఆప్‌ ప్రభుత్వం 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చాక అమలుచేసిన ఉచిత విద్యుత్‌, ఉచిత నీరు పథకాలు 2015లో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కాగా, ఈ ఎన్నికల్లోనూ అవి పనిచేశాయి. మహిళలకు  బస్సులు, మెట్రోరైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించడం ఆప్‌కు లాభించింది. 

 ‘టీనా ఫ్యాక్టర్‌' (ప్రత్యామ్నాయం లేకపోవడం) అనేది లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఏవిధంగా కలిసొచ్చిందో.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కూ అలానే కలిసొచ్చింది.  

 సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం  బీజేపీ ఓటమికి ఒక కారణం. కేజ్రీవాల్‌కు దీటైన అభ్యర్థి బీజేపీలో లేడనే విషయాన్ని ఆప్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగింది.  

 అతివిశ్వాసం బీజేపీని దెబ్బతీసింది. తమ ప్రభుత్వం తెచ్చిన సీఏఏ, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, జమ్ముకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణతోపాటు రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హిందూ ఓటర్లను ఒకేతాటిపైకి తేవడం ద్వారా సులభంగా విజయం సాధించొచ్చని బీజేపీ భావించింది. అయితే, ఆప్‌ మాత్రం అభివృద్ధి పనులనే ప్రచారాస్ర్తాలుగా చేసుకుని విజయం సాధించింది. 

 2017లో మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచే ఆప్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీజేపీ మాత్రం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన తర్వాత రంగంలోకి దిగింది. 

 మహిళా ఓటర్లు గంపగుత్తగా ఆప్‌కే ఓటేశారు. గత మూడు నెలల్లో మహిళల భద్రత కోసం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయడం మహిళా ఓటర్లు ఆప్‌వైపు మొగ్గుచూపడానికి కారణమైంది. 

 ఢిల్లీ జనాభాలో ముస్లింలు 14% ఉన్నారు. బీజేపీని ఓడించగలిగే స్థానంలో ఉన్న పార్టీకే వారు ఏకమొత్తంగా ఓటేస్తూ వస్తున్నారు. 2015 వరకు కాంగ్రెస్‌కు అండగా నిలువగా, ఇప్పుడు ఆప్‌వైపు మొగ్గారు. 

ఒక టీవీ చానల్‌ ఇంటర్వ్యూ సందర్భంగా  కేజ్రీవాల్‌ ‘హనుమాన్‌ చాలీసా’ను జపించడం ద్వారా కొత్త ఎత్తుగడ వేశారు. మతప్రాతిపదికన ఓటర్లను విభజించి లాభపడాలన్న బీజేపీ ప్రయత్నాలకు దీని ద్వారా చెక్‌ పెట్టారు. ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ, ఆప్‌ నేతలు షాహీన్‌బాగ్‌ను సందర్శించలేదు. తద్వారా ముస్లిం అనుకూల పార్టీ అనే ముద్ర పడకుండా చూసుకున్నారు. 


logo
>>>>>>