బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 02:13:41

రేపు సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణం

రేపు  సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణం
  • హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం
  • కేజ్రీని సీఎంగా నియమిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అలాగే సీఎం కేజ్రీవాల్‌ సిఫారసు మేరకు ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. సీఎంగా కేజ్రీవాల్‌తోపాటు మంత్రులుగా మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గెహ్లాట్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, రాజేంద్ర గౌతంలను నియమించారు. మరోవైపు ఆదివారం జరుగనున్న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆహ్వానించారు. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీకి శుక్రవారం ఉదయం ఆహ్వానం పలుకుతూ లేఖ పంపినట్లు ఆప్‌ ఢిల్లీ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ చెప్పారు. అయితే, కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభానికి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది నూతన ఎమ్మెల్యేలను కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు పంపామని గోపాల్‌ రాయ్‌ పీటీఐకి తెలిపారు. 


logo