గురువారం 16 జూలై 2020
National - Jun 15, 2020 , 13:16:53

కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులను ఇలా గుర్తించవచ్చు

కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులను ఇలా గుర్తించవచ్చు

ఇటానగర్‌: కరోనా సోకినట్లు నిర్ధారించిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు కోలుకునేంత వరకు ఐసొలేషన్‌ వార్డుకే పరిమితం కావాల్సి ఉంటుంది. తమ బంధువులతో సహా ఏ ఒక్కరిని చూడలేరు.. కలిసి మాట్లాడలేరు. వారికి వైద్య చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఉంటారు. దీంతో చికిత్స పొందుతున్నంత కాలం అసలు మనుషుల ముఖాలనే చూడలేరు. ఓ వైపు కరోనా సోకిందన్న ఆందోళన మరోవైపు ఎవరినీ చూడలేమన్న బాధతో కరోనా రోగులు కుంగిపోతుంటారు. 

అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లా దవాఖానకు చెందిన వైద్యులు వినూత్నంగా ఆలోచించారు. వైద్య సేవలందించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని కరోనా రోగులు గుర్తించే విధంగా పీపీఈ కిట్లపై తమ ఫోటోలను వారు అతికించారు. అమెరికాలోని దవాఖానల్లోని వైద్యులు పాటించిన ఈ విధానం గురించి ఓ మిత్రుడి ద్వారా తెలుసుకుని ఇక్కడ ఆచరిస్తున్నట్లు చాంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ తెలిపారు. గతంలో ఎయిమ్స్‌ వైద్యుడైన ఆయన ఆ వృత్తిని వీడి సివిల్‌ సర్వీసెస్‌ అధికారి అయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రెండో అత్యధిక జనాభా కలిగిన జిల్లా అయిన చాంగ్లాంగ్‌లో జూన్‌ 1న తొలి కరోనా కేసు నమోదు కాగా ఆదివారం నాటికి ఈ సంఖ్య 55కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 91 కరోనా కేసులు వెలుగుచూశాయి. logo