ఎక్స్పైరీ లైసెన్సుతో రైతుకు శఠగోపం

భోపాల్: ఇప్పటికే కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పులి మీద పుట్రలా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా కొందరు వ్యాపారులు తమ కాలం చెల్లిన మండీ లైసెన్సుతో 4 జిల్లాలకు చెందిన 150 మంది రైతుల నెత్తిపై శఠగోపం పెట్టారు. 2600 క్వింంటాళ్ల పంట కొనుగోళ్లు చేసి రూ.5 కోట్లకుపైగా అన్నదాతలను మోసగించారు.
ఈ నేపథ్యంలోని 22 మంది రైతులు దేవాస్‌లోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. వ్యవసాయ మార్కెట్ల బయట పంటల విక్రయాన్ని అనుమతించడానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. తాము పండించిన పంటలను లైసెన్సు సమయం దాటిపోయిన వ్యాపారులకు పంటలు అమ్మామని, వారు జారీ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు వ్యాపారులు తమకు డబ్బు చెల్లించలేదని విమర్శలు గుప్పించారు. సంబంధిత ట్రేడర్ ను అరెస్ట్ చేసి అతడి భూములను అటాచ్ చేసి, రైతుల సొమ్ము చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ మంత్రి కమల్ పటేల్ సొంత నియోజకవర్గంలోనూ ఇదే తరహా మోసం చోటు చేసుకోవడం గమనార్హం.