బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 12:30:19

బాంబే హైకోర్టుకు అర్నాబ్‌

బాంబే హైకోర్టుకు అర్నాబ్‌

ముంబై : తన అరెస్టును సవాల్‌ చేస్తూ రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో బుధవారం అర్నాబ్‌ను ముంబై లోయర్‌ పరేల్‌లోని నివాసంలో అరెస్టు చేశారు. జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఇవాళ మధ్యాహ్నం పిటిషన్‌ను విచారించనుంది. అర్నాబ్‌ను అరెస్టు చేసిన అనంతరం ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా.. 18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. తిరస్కరించింది.


ప్రస్తుతం అర్నాబ్‌ను అలీబాగ్‌లోని ఓ పాఠశాలలో ఉంచారు. అలీబాగ్‌ జైలును కొవిడ్‌-19 కేంద్రంగా మార్చారు. పిటిషన్‌లో అర్నాబ్‌ తన అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేసేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే ఎఫ్‌ఐఆర్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. తన అరెస్టు ప్రేరేపితమని, మూసివేసిన కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, అలాగే తన టీవీ చానల్‌కు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు మరో ప్రయత్నమని ఆరోపించారు. అరెస్టు సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని, తనతో పాటు కుమారుడిపై పోలీసులు దాడి చేశారని, వ్యానులోకి ఈడ్చుకు వెళ్లారని పిటిషన్‌లో పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.