శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 01:03:52

కవ్విస్తే.. కదనమే

కవ్విస్తే.. కదనమే

  • లఢక్‌కు భారీగా ఆయుధాల తరలింపు
  • గగనతల రక్షణ వ్యవస్థలూ మోహరింపు 
  • ఇప్పటికే చేరిన 45వేల మంది సైనికులు 
  • చైనా మరోసారి కవ్విస్తే గట్టి గుణపాఠమే
  • సిద్ధమవుతున్న భారత త్రివిధ దళాలు

న్యూఢిల్లీ, జూన్‌ 27: కడుపులో కత్తులు దాచుకొని కౌగిలించుకొనే విధానాన్ని అనుసరిస్తున్న చైనాకు గట్టి గుణపాఠం చెప్పేదిశగా భారత త్రివిధ దళాలు కదులుతున్నాయి. గల్వాన్‌లో ఘర్షణ తర్వాత తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకున్న భారత బలగాలు, మరోసారి చైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పేందుకు యుద్ధ సన్నద్ధతను సమకూర్చుకుంటున్నాయి. ఉత్తరాది రాష్ర్టాల్లోని అన్ని మిలిటరీ, ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ల నుంచి భారీ ఆయుధ వ్యవస్థలు లఢక్‌ చేరుకుంటున్నాయి. 

లఢక్‌లో యుద్ధ నాదం

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్న చైనా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం ఆయుధ వ్యవస్థలను లఢక్‌కు తరలిస్తున్నది. ఇప్పటికే అక్కడికి 45వేల బలగాలను తరలించినట్టు సమాచారం. ఎల్‌ఏసీ వెంట చైనా యుద్ధవిమానాల కదలికలు పెరగటంతో సైన్యంతోపాటు, వైమానికదళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది. గత రెండుమూడు వారాలుగా సుఖోయ్‌-30 వంటి శక్తిమంతమైన చైనా యుద్ధవిమానాలు ఎల్‌ఏసీకి అతి సమీపంలో తిరుగుతున్నాయి. దాంతో భారత బలగాలు కూడా భారీ ఆయుధ వ్యవస్థలతో సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన మరుక్షణం శత్రు విమానాలను ధ్వంసం చేయగల ఆకాశ్‌ క్షిపణులను మోహరించారు.  

వేచి చూద్దాం

గల్వాన్‌ ఘర్షణకు ముందు ఈ నెల 6న భారత్‌- చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చల్లో ఎల్‌ఏసీ వెంట బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించారు. కానీ చైనా అందుకు కట్టుబడకపోవటంతో గల్వాన్‌ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత దౌత్య, సైనిక మార్గాల ద్వారా జరిగిన చర్చల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించారు. అందుకు చైనా కట్టుబడి ఉంటుందా లేదా అని వేచిచూస్తున్నామని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   

చైనాదే తప్పు..సర్వేలో వెల్లడి 

పొరుగుదేశాలన్నింటితో కయ్యం పెట్టుకొంటున్న చైనాపై ఆ దేశ పౌరుల్లోనే అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. గల్వాన్‌ లోయలో భారత్‌తో ఘర్షణకు దిగటంపై తమ ప్రభుత్వంపై బహిరంగంగానే చైనా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారని సెక్లాబ్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. 


logo